జనపదం -ఆదివారం -18-08-2024 E-Paper
‘కోత’ల మాఫీ..
రుణమాఫీ అంతా మోసం..
మాటల్లోనే గొప్ప., లెక్కల్లో బొక్కా..
రూ.41 వేల కోట్లకు 17 వేల కోట్లతో చెల్లుచిటీ..
అడిగితే దాడులు.. అన్నదాత పక్షన నిలిస్తే కేసులు..
మాఫీపై లెక్క తేల్చండి…..
నిజమని నిరూపిస్తే తప్పు ఒప్పుకుంటా.. తప్పుకుంటా..
లేదంటే నిలదీస్తూనే ఉంటా..
ఒట్లేసిన దేవుళ్లూ క్షమించరు..
మాజీ మంత్రి హరీష్ రావు
సీఎం రేవంత్ పై ఆగ్రహం..
మాఫీ వివరాలు వెల్లడించాలని డిమాండ్..
మోసంతో జయించలేమని హితవు..
‘‘మాఫీ మొత్తం కోతలమయం. చెప్పింది కొండంత.. చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది ఒకటి., కేబినెట్ సమావేశాల తర్వాత ప్రకటించింది మరోటి.., బడ్జెట్ కేటాయింపుల్లో చూపింది ఇంకోటి.., ఆఖరుకు చేసింది ఇంకోటి. మీరు మాట్లాడిందే మీకు గుర్తు చేస్తే తప్పా..? మీరేం చేసినా చూస్తూ కూర్చోవాలిగానీ, ఇదేంటని మాత్రం ప్రశ్నించొద్దా..? ఇదేనా దేవుళ్ల మీద ఓట్లేసి తీరు., ఇదేనా అన్నం పెట్టే రైతు దేవుడికి మీరిచ్చే భరోసా..? దాడులతో భయపడేది లేదు., బెదిరింపులకు తగ్గేది లేదు. రైతు పక్షాన నిలుస్తాం., తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటాం.’’
– మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు
=======
జనపదం, హైదరాబాద్
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగే దొంగా.. దొంగా.. అన్నట్టుగా ఉందని, రుణమాఫీ ఎగనామం పెట్టి ఫోజులు కొడుతూ, అడిగిన వారిపై దాడులకు ఉసిగొల్పెడి దిగజారుడు స్థాయికి చేరిందని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. శనివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో ముచ్చటించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికైనా తప్పు అయిందని సీఎం క్షమాపణ కోరాలని, పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నోరు పెద్దగా చేస్తే లాభం లేదు..
సీఎం తప్పును కప్పిపుచ్చుకోవడానికి నోరు పెద్దగా చేస్తే లాభం లేదన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ కథ ఎన్కటికి పంచపాండవులు అంటే మంచం కోళ్లవలె, ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపించినట్టుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9 సోనియా పుట్టిన రోజు కానుకగా 40వేల కోట్ల రూపాయల మాఫీ ఏకకాలంలో చేస్తానని ఇదే నోటితో చెప్పి మాటతప్పిండన్నారు. ఆ తర్వాత దేవుళ్లపై ఒట్లేసి ఒట్లు వేయించుకుని గద్దెనెక్కి గద్దిరిస్తున్నాడన్నారు. వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక ముఖం చాటేసి పారిపోయాడన్నారు.
అన్నీ కోతలే..
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రుణమాఫీ అయిపోయిందని ప్రకటిస్తే సంతోషించానని, కానీ లెక్కలు చూస్తే కేవలం 17వేల కోట్లతో 22లక్షల మందికి చేసి లక్షలాది రైతులకు అన్యాయం చేశాడన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతుల సంఖ్య 47లక్షలని చెప్పి, ఇప్పుడు కేవలం 22 లక్షల మందితో సరిపెట్టాడన్నారు. కనీసం చెప్పిన లెక్కలో సగం కూడా చేయలేదని దుయ్యబట్టారు.
నోరా మోరా..?
రేవంత్ ది నోరా.. మోరా.. అర్థం కావడం లేదని, చెప్పేటోడికి చెవుడైనా వినేటోనికి వివేకం ఉంటది కదా అని హరీశ్ అన్నారు. రైతుల సంఖ్య తగ్గడమేమిటి., రుణగ్రహీతలు మరీ తగ్గడమేమిటీ.? డబ్బులు మాత్రం 17 వేల కోట్లతో సరిపోవడమేమిటో ఆయన చెప్పిన లెక్కల్లోనే తెలుస్తోందన్నారు. ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నాడో చెప్పాలన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా తాను రేవంత్ కు రుణమాఫీ అందరికి అయ్యిందని నిరూపించాలని సవాల్ విసురుతున్నట్టు చెప్పారు.
ప్లేస్, టైం ఫిక్స్ చెయ్..
రుణమాఫీ సక్రమమే , లెక్కలు చూసుకుందాం రా.. అని రేవంత్ రెడ్డే ప్లేసు, డేటు, టైం చెప్పితే అక్కడకు తాను వెల్లడానికి సిద్ధమని హరీష్ పేర్కొన్నారు. ఎవరు మాట్లాడుతున్నది నిజమో ఖుల్లం ఖుల్లంగా తేల్చుకుందాం అన్నారు.తాను మాట తప్పేటోడిని కాదని, చర్చకు వస్తావా… రేవంత్ అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పార్టీలు మారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర నీదన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ఎన్నోసార్లు రాజీనామా చేసిన చరిత్ర తనదన్నారు. చంద్రబాబు సంకల జొచ్చి రైఫిల్ పట్టుకున్ననాడు తాను ప్రజల కోసం ఫైట్ చేశానన్నారు. ఎప్పటికీ మభ్యపెట్టి మతలబు చేసి అందరిని నమ్మించలేవని, రైతన్నను దగా చేసిన నీ తీరును యావత్ ప్రజానీకం గమనిస్తుందన్నారు. రైతు బంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నవ్, డబ్బా వాయిస్తున్నవ్ అంతా చూస్తున్నారనే విషయం మర్చిపోకన్నారు. తాము ఆగస్టు 6న తెలంగాణ భవన్ లో రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే గడిచిన 10, 11 రోజుల్లో లక్ష 16 వేల ఫిర్యాదులు వచ్చాయని, రుణమాఫీ కాలేదు న్యాయం చేయండని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ చెయ్యక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తోందని, దమ్ముంటే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
అంతా ఫ్లాప్..
పరిపాలనలో ఫ్లాపని, తొండి చేయడంలో తోపవని, భూతులు మాట్లాడంలో టాపవని, ఇందులో ఎవరికి అనుమానం లేదన్నారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి, సిగ్గులేక చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంట అన్నట్లు నన్ను రాజీనామా చెయ్యమంటున్నవని దుయ్యబట్టారు.
ఒట్లెట్ల మరుస్తావ్..
మమ్మల్ని తిట్లు తిడుతవ్ కావొచ్చు గానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మర్చిపోతవు అన్నారు. ఎన్ని దేవాలయాల మీద ఒట్లు వేసిండో గుర్తు చేసుకోవాలన్నారు. యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహా స్వామి సాక్షిగా.., రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా.., జోగులాంబ సాక్షిగా.., బాసర సరస్వతి మందిరం సాక్షిగా.., కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా, కురుమూర్తి సాక్షిగా, సిద్దుల గుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా.., పాలమూరు ప్రజల సాక్షిగా, జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా…, సేవాలాల్ సాక్షిగా, బావూజీ సాక్షిగా… మెదక్ చర్చ్ సాక్షిగా… ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా.. అంటూ గుడి, చర్చి, మసీద్ సాక్షిగా ఒట్లు వేసి రుణమాఫీ అమలు చేస్తానని మాట తప్పావ్. దేవుళ్లను కూడా మోసం చేసిన మొనగాడివి నువ్వురేవంత్ అన్నారు. దేవుళ్ళ మీద నిజమైన భక్తీ ఉన్న ప్రతి వ్యక్తీ నువ్వు చేసిన పాపం చూసి భయ పడుతున్నాడు. నువ్వా ప్రాయశ్చిత్తం చేసుకోవు. నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేను తీర్థయాత్రకు బయలుదేరుతానని ప్రకటించారు.
దాడులు చేస్తే పెట్టుబడులొస్తాయా..
రైతుల తరుపున రుణమాఫీ చెయ్యాలని ప్రశ్నిస్తే గుండాలతో దాడులకు పురామాయించి గొప్పతనం నీదన్నారు. దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..? అమెరికా పోయింది పెట్టుబడులకా లేక, దాడుల గురించి నేర్చుకోడానికా అని ప్రశ్నించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, దాడులు కొత్తకాదు.., దాడులకు భయపడం., రైతుల తరుపున పోరాటం ఆపం అన్నారు. ఇకముందు ఇలాంటివి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.