JanaPadham-16-09-2024 EPaper
సంస్కారికి, హీనుడికి మధ్య అంతరమిది., తల బిరుసుకు, తల్లో నాలుకకు మధ్య వైరమిది. మాట జారడం గొప్పనుకునే అల్పుడికి., నలుగురికి ఉపయోగపడేలా మాట్లాడడమే నిజమైన నాయకత్వం అనుకునే మేధావికి మధ్య జగడమిది. ఒక్క వేలు అటు చూపిస్తే, మిగతా నాలుగు ఇటే చూపిస్తాయనే ఇంగితం లేని తనంతో ప్రవర్తించే మిడిసిపాటుకు., వ్యవస్థపై గౌరవం, రాజకీయ అనుభవానికి మధ్య సాగుతున్న సమరమిది.
**********
మనిషితో పాటు హోదాకు, కుర్చీకి కూడా విలువ ఇవ్వాలని తపించే ఔదార్యం ఓ వైపు.., కూర్చున్నాం కదా.. ఏం చేసినా చెల్లుతుంది., ఎలా మాట్లాడినా నడుస్తుంది అనే నడిమంత్రపు సిరి బాపతు మరో వైపు. ప్రజా సేవ చేయాల్సిన వారు పర్సనల్ టార్గెట్లతో దుమ్మెత్తిపోసుకోవడంతో ప్రయోజనమేంటో బాధ్యులకే తెలియాలి. హోదాలో ఉన్న వారు వైరి పక్షం మంచిచెడులను స్వీకరించి పనులతో సమాధానం చెప్పాల్సిన వేళ ఫ్రస్ట్రేషన్ లో పేలడం ఏమిటో ‘ముఖ్య’ నేతలకే అర్థం కావాలి. ఏదిఏమైనా సమాధానం చెప్పే ఓపిక లేనప్పుడే సంయమనం పోతుంది., పాలన చేతగాకపోతేనే పక్కోరి తప్పులు వెతికే పనిని కనిపిస్తుంది. వ్యక్తిగా నచ్చకపోయినా, ప్రజలవాడిగా మెప్పించేంత లేకపోవడమే సర్కార్ పెద్దల మాట తూలుడుకు కారణంగా తోస్తున్నది. నోరు జారి మూటగట్టుకోవడమా..? పనిలోకి దిగి కీర్తి కట్టుకోవడమా..? తేల్చాల్సింది ఎవరికి వారే., తన్మయించుకోవాల్సింది ఎవరి ఔన్నత్యాన్ని ముమ్మాటికి వారే.
ఒరే సన్నాసి…
అని మేం అనలేమా..?
నీ విలువ ఎలాగూ పోయింది.. కూర్చీదైనా కాపాడు..
దాక్కోలేదు.. నీ గుండెల్లో నిద్రపోతున్నా..
రుణమాఫీ చేసే వరకు నీడలా వెంటాడుతా..
సీఎం నోటి బురద కడగడం కష్టం..
ప్రజల గురించి మర్చిపోయి.., ప్రతిపక్షాలపై విరుచుకుపడడం ఎందుకో..?
బుద్ధి కుర్చ సీఎం.. బుద్ధిగా మసులుకో..
లేదంటే మధ్యలోనే పోతాం..
కాంగ్రెస్ గురించి నీకు తెల్వదనుకుంటా..
ఎప్పుడైనా, ఏమైనా జరుగొచ్చు…
మిడిసిపాటు వదిలి., ప్రజా పాలన చెయ్..
మాజీ మంత్రి హరీష్ రావు
సీఎం రేవంత్ పై ఫైర్..
రాష్ట్ర పాలన గాలికి వదిలారని ఆగ్రహం..
జనపదం, బ్యూరో
‘‘అరే హౌలే., ఏరా గాండు., పోరా పుచ్కీ.., నువ్వో దరిద్రుడివి.., నీలాంటి వారు పెద్ద సన్నాలు.., అనే మాటలు అనలేక కాదు., నోటికి రాకా కాదు. పుట్టిన పుట్టుక., పెరిగిన సంస్కారం., నిర్వర్తిస్తున్న బాధ్యతలకు తలొగ్గి మాటలు వెనక్కి తీసుకుంటున్నామని’’ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని, ఒకటి వర్షాలతో వచ్చినదైతే, మరోటి చిల్లర సీఎం రేవంత్ అబద్ధాల వరద అన్నారు. వరదలతో వచ్చిన బురదను కడుక్కోగలుగుతున్నాం గానీ, ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తున్న మురుగు బురదను మాత్రం కడగలేకపోతున్నామని దుయ్యబట్టారు. ఆ మాటల దుర్వాసన మోరీల కంపును మించి పోయింది ఎద్దేవా చేశారు. కనీసం ప్రభుత్వంలో ఉన్నాననే సోయి లేకుండా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఈ మధ్యే నాకు కాకున్నా నా కుర్చీకన్నా మర్యాద ఇవ్వమని అన్నాడని, అయినా మళ్లీ మళ్లీ అదే తీరుగా ప్రవర్తిస్తూ మర్యాద పోగొట్టుకుంటున్నాడని, కుర్చీ మర్యాదను కూడా మంటగలుపుతున్నాడన్నారు.
సంస్కారం అడ్డొస్తుంది..
ముఖ్యమంత్రికి ఆయన భాషలోనే జవాబు ఇవ్వడం నిమిషంలో పనని, కానీ ఆ భాష మాట్లాడటానికి సంస్కారం అడ్డొస్తుందన్నారు. పదే పదే పొడుగు గురించి దుర్భాషలాడుతున్నాడని, అవును… తాను నిజంగానే పొడుగని, తెలంగాణ ఉద్యమం తనను ఎంతో ఎత్తుకు చేర్చిందని గర్వంగా ప్రకటించారు. కానీ, సీఎం రేవంత్ బుద్ధి కురుచదని, చరిత్ర, భాష.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పొట్టివే అని, ఆయన నేలకు ఇంతుండి ఆత్మన్యూనతతోనే తన పొడుగుపై మాట్లాడుతున్నాడన్నారు. ప్రజల దీవెనలతో తాను తాటిచెట్టంతా ఎదిగానని, రేవంత్ వెంపలి చెట్టంత భూమికి జానెడున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాను సీఎం ను లిల్లీఫుటని, సన్నాసి అని అనలేక కాదని అలా మాట్లాడే కుసంస్కారం తనకు లేదన్నారు.
ప్రజల గురించి ఆలోచించు..
తన ఎత్తు ఎంత ఉంటే సీఎం కు ఎందుకని, ఇప్పటికి ఈ విషయమై 20 సార్లు మాట్లాడాడని, తన హైట్ గురించి మానేసి ప్రజలు, రైతుల గురించి ఆలోచించాలని హరీష్ రావు సూచించారు. రుణమాఫీ చెయ్యలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సిగ్గులేకుండా మాట్లాడుతున్న సీఎం ఈయనే అన్నారు. రేవంత్ దుర్మార్గ నిబంధనలతో సురేందర్ రెడ్డి అనే రైతు ప్రాణం పోయింది నిజం కాదా అన్నారు.
వెళ్దాం.. వస్తావా..
రుణమాఫీ పూర్తి చేశా.. అని సీఎం మాట్లాడుతున్నాడని, దేవుళ్ల మీద కూడా ఓట్లేసి అబద్ధాలు చెప్పిన సీఎం ఆయననే చూస్తున్నామన్నారు. దమ్ముంటే రుణమాఫీ అయిందని నిరూపించాలని, తాను ఎక్కడి రమ్మానా వస్తానని రేవంత్ కు సవాల్ విసిరారు. ఆయనకు సంబంధించిన కొండారెడ్డిపల్లి చౌరస్తాకి రావాలా.., లేదంటే సిద్దిపేట వెంకటాపురం వెళ్దామా..? రేవంత్ చెప్పాలన్నారు. వెంకటాపురంలో 122 మందికి అయితే 82 మందికి కాలేదని, కోటి 13 లక్షల 74 వేలు అయితే కోటి 5 లక్షల మాఫీ జరగలేదన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదని, సురేందర్ రెడ్డి అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసిన వారి వివరాలు తనకు పంపడం కాదని, అవసరమైతే పూర్తి డాటా నేను వారికి పంపుతానని పేర్కొన్నారు.
సన్నాసి అనడం నాకూ వచ్చు..
రుణమాఫీ 31 వేల కోట్లు జరిగితే 17 వేల కోట్లు చేశావ్.. అంటే సగం కూడా కాలేదని హరీష్ నిలదీశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేనీ సన్నాసి అని తాను అనలేనా అని ప్రశ్నించారు. అలాగే పంట బోనస్ బోగస్ చేసిన సన్నాసని, ఆరు గ్యారంటీలు నెరవేర్చని సన్నాసి అని.., పింఛన్ 4000 అని మాట తప్పిన సన్నాసి అని.., మహిళలకు 2500 రూపాయలని మాట తప్పిన సన్నాసి అని.., ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిన సన్నాసి అని.. నేను అనాలేనా అని హరీష్ దుయ్యబట్టారు. ఒకటి కాదు రెండు కాదు 100 సార్లు సన్నాసి అనగలనని, కానీ తనకు విలువలున్నాయని, సీఎం లాగా నోరు పారేసుకోలేనన్నారు. ఒక వేలు నాకు చూపిస్తే నాలుగు వేళ్లు తననే చూపుతాయని విషయం సీఎం గుర్తుపెట్టుకోవాలన్నారు. రైతుల కళ్లలో ఆనందం కాదు, కన్నీళ్లు తెప్పించాడన్నారు.
ఎవరి మాట నమ్మాలి..
రెండు లక్షల పైన రుణం ఉంటే మాఫీ చేస్తమని సీఎం అంటున్నాడని, అదే సమయంలో వ్యవసాయ మంత్రి ఏమో డబ్బులు కట్టండని సెలవిస్తున్నారని ఎవరి మాటలు నమ్మాలని హరీష్ నిలదీశారు. రాష్ట్ర మంత్రులకు సుతి లేదు, క్యాబినెట్ సుతిలేదు .. ఇదేం కేబినెట్టో సీఎం కే తెలియాలన్నారు. తాను రెండు లక్షల పైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ల జాబితా పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మాటకొస్తే తుమ్మల చెప్పింది కరెక్టా..? లేదంటే సీఎం చెప్పింది కరెక్టా..? తేల్చాలన్నారు. మాట మీద లేని సన్నాసి ఎవరో చెప్పాలన్నారు.
నీ గుండెల్లో నిద్రపోతున్నా..
తాను మాట తప్పి ఎక్కడెక్కడో దాక్కున్నానని రేవంత్ పేలుతున్నాడని, తానెక్కడికి పోలేదని, సీఎం గుండెల్లో నిద్ర పోతున్నానన్నారు. రేవంత్ కు నిద్ర పట్టనీయకుండా సగం రుణమాఫీ చేయించానని, మిగతా సగం చేయించే దాకా వదిలిపెట్టి ప్రసక్తే లేదన్నారు. రోజూ ఆయన వెంటే పడుతానన్నారు.
ఫోర్త్ సిటీ ఎక్కడిది..?
కేసీఆర్, కేటీఆర్ కృషి చేసి రూ.1500 కోట్లు ఖర్చుపెట్టి 12 వేల ఎకరాలు సేకరించారని, అక్కడ సీఎం రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. వంట అంతా అయ్యాక వడ్డించేందుకు వచ్చాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూములు వాపస్ అన్నాడని, అయితే పార్మా సిటీ పెట్టు లేదంటే భూములు ఇవ్వాలని, మధ్యలో ఈ డ్రామాలేంటన్నారు. ఉచిత కరెంటు ఉత్త కరెంటు చేశాడని, నిజమైన ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్ అని, మోటార్లు కాలకుండా చూసింది బీఆర్ఎస్ సర్కార్ అన్నారు.
పగటి కలలు ఆపు..
సీఎం రేవంత్ రెండు సార్లు గెలుస్తామని పగటి కలలు కంటున్నాడని, కాంగ్రెస్ కు అంత సీన్ లేదన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలిపిస్తే 5 ఏళ్ల లోగా ప్రభుత్వాలు పోయాయన్నారు. రేవంత్ అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటాడని, లేదంటే అంతే అన్నారు. ఇప్పటికైనా మంచిగా ప్రవర్తించాలని, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కటితోనే సరిపెట్టుకోవాల్సిందే అన్నారు. 2018లోనే కేసీఆర్ టీచర్ల ట్రాన్స్ ఫర్ చేశాడని, కానీ సీఎం 18 ఏళ్ల తర్వాత చేశామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇజ్జత్ తీసుకోకు..
ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ తీస్తున్నాడని, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి పరువు తీసుకోవద్దని హరీష్ సూచించారు. పాఠశాలల్లో ఉచిత కరెంటు అని ఉత్తా మాటలు చెబుతున్నాడని, కేసీఆర్ స్కూల్స్ కి గ్రాంట్స్ ఇస్తే అది బంద్ చేసి స్కూల్ కరెంట్ బిల్లులు కడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఎవరి గాంధీ..
రేవంత్ రెడ్డేమో గాంధీని పంపాను., మనోడే అన్నాడని, శ్రీధర్ బాబేమో బీఆర్ ఎస్ వాళ్లు కొట్టుకున్నారని, కాంగ్రెస్ అని ప్రచారం చేస్తున్నారన్నారు వాళ్లు మా పార్టీ ఎమ్మెల్యేలే కాదన్నారు. ఇంతకీ గాంధీ ఎవరి వాడో చెప్పాలన్నారు. సీఎం మాటలు చూస్తుంటే దాడి చేయించింది తానే అని తెలిసిపోతుందన్నారు. పైకి హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, రీజినల్ రింగ్ రోడ్డు కోసం తెగ కష్ట పడ్డాం, మంజూరు చేయించాం అంటున్నారని, కిషన్ రెడ్డి 2022 డిసెంబర్ 6 భారత్ మాల ప్రాజెక్టు లో రీజినల్ రింగు రోడ్డు కలిసి ఉంటుందని చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఉత్తరం వైపు తాము చేయించామని, దమ్ముంటే దక్షిణం వైపు పనులు చేయించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో చేసినవి కూడా తామే చేశామని చెప్పడం సిగ్గు లేని చర్య అన్నారు. సీఎం చెప్పే అబద్ధాలు వింటే అబద్ధాలు కూడా హుస్సేన్ సాగర్ లో దూకుతాయన్నారు. రుణమాఫీ, టీచర్ల బదిలీ, బోనస్, రీజినల్ రింగ్ రోడ్డు, ఫోర్త్ సిటీ ఇలా రోజుకో పది అబద్ధాలు ఆయనకు అలవాటయ్యాయన్నారు.
ఇప్పటికైనా చెయ్..
రుణమాఫీ రూ.31 వేల కోట్లు చెల్లించే వరకు బీఆర్ఎస్ సీఎం వెంటే పడుతుందన్నారు. ఇప్పటికైనా బాధ్యతగా మాట్లాడడం, అగౌరపర్చకుండా నడుచుకోవడం చేయాలన్నారు. తమకు మాట్లాడడం చేతగాక కాదని, దంచుడ్రి., కొట్టుర్రి, చింత కాయ కొట్టుర్రి అంటే కింది స్థాయిలో తాము మాట్లాడితే గొడవలు జరగవా అని ప్రశ్నించారు. నిజానికి రాష్ట్ర బ్రాండ్ దెబ్బ తింటున్నది సీఎం వల్లే అని, 9 నెలల్లో 9 మత కలహాలకు జరిగాయని, సగం రుణమాఫే జరిగిందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.