దేవరకొండ: నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను అందరిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విధినిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ చేయడాన్ని బీఆర్ఎస్తీ వ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జీలు జరిపిన దాఖలా లేదన్నారు. పితృవియోగంతో బాధపడుతున్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు వందరోజుల్లోపు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఏ ఒక్క విద్యార్థికీ కార్డు ఇవ్వలేదన్నారు. అమ్మాయిలకు ఉచిత స్కూటీ ఇస్తామన్నారు.. ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పారు.
నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఆరునెలలైనా ఇవ్వలేదని, దీనిపై అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే అలాంటి హామీనే తాము ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భృతి ఇవ్వకపోవడం ఒక మోసమైతే హామీ ఇవ్వలేదని చెప్పడం మరో మోసమని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు నాలుగో డీఏ కూడా పెండింగులో ఉందని, రిటైరైన ఉద్యోగులకు పింఛన్ బెనిఫిట్లను రెండు మూడు నెలలుగా ఆపేశారని చెప్పారు. సీఎం రేవంత్ మార్చిలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి డీఏ విడుదల చేస్తామని మోసం చేశారన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రశ్నించే గొంతు అయిన రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే పీఆర్సీ కోసం, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని వెల్లడించారు. ఒక్కో హామీపై చేతులెత్తేస్తూ వస్తున్న కాంగ్రెస్‌కు నిరుద్యోగులు ఓటుతో బుద్ధి చెప్పాలని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని, దీంతో ప్రైవేట్ కాలేజీలు సిబ్బందికి నెలలుగా జీతాలివ్వడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ సంగతి చూసేవాళ్లు..
రైతుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదు.. 30 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతుల ముఖాల్లో చిరునవ్వు చూశామని, ఇప్పుడు కన్నీళ్లు చూస్తున్నామని చెప్పారు. తమ హయాంలో మూడు నాలుగు రోజుల్లో ధాన్యం కొని 48 గంటల్లో డబ్బులు చెల్లించామని గుర్తుచేశారు. దొడ్డు వడ్లకు బోనస్ లేదని సీఎం చావు కబురు చల్లగా చెప్పాడని మిర్శించారు. ఓట్లు పడక ముందు ఈ మాట చెప్పివుంటే రైతులు కాంగ్రెస్ సంగతి చూసేవాళ్లని తెలిపారు. సన్నరకాలకే బోనస్ అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని, కాంగ్రెస్‌కు ఎన్నికల క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే ఆ పార్టీ అబద్ధాలను మోసాలను ఆమోదించడమే అన్నారు. బీజేపీ కూడా ప్రజలను మోసం చేస్తున్నదని, పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వలేదని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ అన్నా వచ్చిందా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిక్రూట్మెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు కనువిప్పు కలగాలంటే ప్రశ్నించే గొంతు అయిన రాకేశ్ రెడ్డిని గెలిపించాలన్నారు.