హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ హథ్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్‌లో నిర్వహించిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 121 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు.
బాబా ఆచూకీ లేదు
అయితే ప్రస్తుతం ఆ బాబా ఆచూకీ చిక్కడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు.
ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా వాహనం వెంట జనం ఉరికినట్లు తెలుస్తోంది. బాబా నడిచిన ప్రదేశంలోని మట్టిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనుచరులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. మట్టి కోసం కిందకు వంగిన సమయంలో జనం ఒకరిపై ఒకరు పడ్డారు.
మెయిన్‌పురి జిల్లాలోని భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ ఆయన ఆచూకీ చిక్కలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. విషాద ఘటన తర్వాత ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ఆశ్రమంలో బాబాను కనుగొనలేదని, ఆయన ఇక్కడ లేరని డిప్యూటీ ఎస్పీ సునిల్ కుమార్ తెలిపారు.