Milk | పాలు ఈ పేరు వినని వారు ఉండరు. వాటిని తాగని వారు ఉండరు. పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలకు మరే పదార్థం సాటిరాదు. ఎందుకంటే ఆకుకూరల్లో క్యాల్షియం అత్యధికంగా ఉన్నప్పటికీ, దాన్ని మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాల ద్వారా లభించే క్యాల్షియం అయితే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే దాదాపు 91 శాతం క్యాల్షియం పొందినట్లే అని న్యూట్రిషన్స్ చెబుతున్నారు. ఈ పాలు ఎముకలను పటుత్వం చేస్తాయి. శక్తి విడుదల కావడానికి తోడ్పడే పాస్ఫరస్ సైతం పాలల్లో లభిస్తుంది. ఎముకల్లో క్యాల్షియం గట్టిపడటానికి దోహదం చేసే విటమిన్ డీ కూడా పాలలో కొంత వరకు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఇవే..
- పాలు దంతాల మీద ఉండే గట్టిపొరను దెబ్బతినకుండా చూస్తాయి.
- పాలను రోజు తాగితే.. గుండెజబ్బు, పక్షవాతం బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.
- పాలు తాగడం వల్ల గుండె, రక్తనాళాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.
- పాలలోని లాక్టిక్ ఆమ్లం మృతకణాలను తొలగించి, చర్మం కళకళలాడేలా చేస్తుంది.
- పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడేవారు పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే జీవితకాలం పెరిగే అవకాశం ఉంది.
- పాలల్లో ఉండే రైబోఫ్లేవిన్ నోటిపూత బారిన పడకుండా కాపాడుతుంది.
- పాలలో ఉండే ఇమ్యూనో గ్లోబులిన్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- జున్నుపాలతో రోగనిరోధక శక్తి మరింత మెరుగవుతుంది.
- పసి పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు పాలు తాగొచ్చు. ఎదిగే పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు పాలను ఎక్కువగా తాగాలి.