కడుపు నింపుకోవడానికి ఆహారం తీసుకుంటాం. ఈ ఆహారంలో ప్రధానమైనది అన్నం. బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వండుకొని ఆరగిస్తాం. ఇలాంటి బియ్యాన్ని ఆహారంగా వండుకొని తినడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఒకప్పుడు దంపుడు బియ్యమే తినేవారు. చూడడానికి దుమ్ము పట్టినట్టుగా, ముదురు రంగులో కనిపించినప్పటికీ.. ఆ దంపుడు బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దంపుడు బియ్యం తినడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బియ్యం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహులకు కూడా ఎంతో మంచిదని సూచిస్తున్నారు.
వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు తవుడుతో పాటు విటమిన్లు, ఖనిజాలు తొలగిపోతాయి. అందుకే తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యం బెటర్ అని పలు పరిశోధనల్లో తేలింది. వారంలో ఐదు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. తెల్ల బియ్యాన్ని 50 గ్రాముల వరకు తగ్గించి, ఆ స్థానంలో దంపుడు బియ్యాన్ని తింటే.. డయాబెటిస్ ముప్పు 16 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దంపుడు బియ్యం తినడం వల్ల బీపీ కూడా తగ్గిందట. దంపుడు బియ్యంలో ఉండే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దంపుడు బియ్యం గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. వీటిలో ఉండే పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో కూడా గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగి.. వెంట వెంటనే ఆకలిగా అనిపించదు.