హైదరాబాద్ : గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా భానుడి భగభగలతో హైదరాబాదీలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కానీ ఉన్నట్టుండి మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం కురిసింది. 30 నిమిషాల పాటు భారీ ఈదురుగాలులు వీచాయి.
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, వనస్థలిపురం, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఓయూ, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, సరూర్‌నగర్, అంబర్‌పేట, కాచిగూడ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు వీచాయి. వర్షం కూడా పడింది. వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేలకొరిగిన చెట్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈదురుగాలులు, భారీ వర్షానికి తిమ్మాయిపల్లి – శామీర్‌పేట్ దారిలో చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తుండగా వారిపై చెట్టు విరిగి పడింది. నాగిరెడ్డి రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ధనుంజయ అనే వ్యక్తి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇక ఆదివారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉప్పల్‌లో అత్యధికంగా 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్‌లో అత్యధికంగా 47 డిగ్రీలు, జగిత్యాలలో 46.5, పెద్దపల్లిలో 46.4, ఆసిఫాబాద్‌లో 45.9, మంచిర్యాలలో 45.8, ఆదిలాబాద్‌లో 45.7, నిర్మల్‌లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో చల్లగా మారిన వాతావరణం
ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం pic.twitter.com/fqkYuig46R
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2024