కోటలో వాళ్లు.. నీటిలో వీళ్లు..
మంత్రగణం అక్కడ.. అమాయకపు జనం ఇక్కడ…
క్యాప్షన్ : సాయం కర్మ.. భరోసా భ్రమ..
ఇల్లు దాటని సీఎం.. లండన్ లో కొండా…
లాబీయింగ్ లో ఉత్తమ్..
గొంతునొప్పితో కోమటి రెడ్డి
నాలుగు ఊళ్లకే తుమ్మల పరిమితం..
మధిర దాటని డిప్యూటీ సీఎం
పట్నంకే పరిమితమైన పొంగులేటి..
జాడలేని జూపల్లి..
క్షేత్రంలో కేవలం పొన్నం., సీతక్క..
జనానికి భరోసా ఏది..?
మునుగుతుంటూ కాపాడే దిక్కేది..?
బురద తెలియనిది కాదు., వరద కొత్తేమీ కాదు.
నమ్మడం అలవాటైంది.., మునగడం పరిపాటైంది.
సాయం ఆశించడమే భ్రమ.., భరోసాకై ఎదురు చూడడం కర్మ.
ఎంతైనా వాళ్లు మహా నేతలు., ఎప్పటికీ మారనివే మన గీతలు.
కొట్టుకపోతే వాళ్లకేంటి.., చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలితే వారికి పోయేదేంది. వాళ్లు ఉండాలనుకున్న తీరే ఉంటారు., చేయాలనుకున్నప్పుడే చేస్తారు. వరుణుడు దంచుతున్నాడనో.., వరదలు ముంచుతున్నాయనో వాళ్లు ముందుంటారనుకుంటే అత్యాశే. అయినా ఎవరి పనుల్లో వాళ్లు బిజీబిజీ. ఒకరేమో సొంత కార్య చక్కబెట్టుకోవాలి., మరొకరేమో విదేశాల్లో పర్యటించాలి.., ఇంకొకరేమో ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి., ఒకాయనకేమో గొంతు సహకరించదు., ఇలా చెప్పుకుంటూ పోతే కేబినెట్ అంతా వారివారి కార్యాల్లో మస్త్ బిజీ. ఒక్క ఇద్దరికే ఏం పనిలేక ప్రజలు, వరద., బురద, మునక.., అంటూ సమయమంతా వృథా చేసుకున్నారు. ఇంత ఉపద్రవం జరుగుతున్న సీఎం అండ్ టీం వ్యవహరిస్తున్న తీరుంది చూడు మహాద్భుతం. ఎవరెక్కడపోతే ఏంది..? ఏదేమైతే ఏంటి..? కోటలో కూర్చుని మాటలతో దాటేస్తున్నామా.. లేదా.. అనే కాన్సెప్ట్ తో సాగుతున్న విధానం బహు ఆదర్శం సుమీ…
కనీసం ఇప్పుడున్నా మారకపోతుందా., సాయం అందకపోతుందా.., భరోసా దక్కుతుందేమోనని జనానికి అది భ్రమే తప్ప నిజం కాదని తెలిసిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు నాయకులు మారినా ఎప్పటికీ వ్యవస్థలో మారనిదే అదని మరోమారు నిరూపితమైంది. సీఎం రేవంత్ సహా కేబినెట్ మంత్రులంతా వరద సాయంలో స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉన్నా, వ్యక్తిగత కార్యాల్లో బిజీగా గడిపారు. ప్రజలకు మొండి చేయే చూపించారు. మాటలు కోటలు దాటాయి తప్ప, చేతలు గడప దాటలేదు.. అని మరోమారు నేతలు నిరూపించారు.
ఇబ్బందుల్లో ప్రజలు..
భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంటే భరోసా ఇవ్వాల్సిన వారు బాధ్యత మరిచిన తీరు బాధాకరం. రాష్ట్ర సర్కార్ లో కీలకమైన స్థాయిల్లో ఉన్న నాయకులు ఎవరికి వారుగా మాటలతో కోటలు దాటవేశారేగానీ, సాయం మాత్రం గడపదాటలేదు అన్నట్టుగా వ్యవహరించి ప్రజలతో ఛీత్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఫైర్, రక్షకభటుల పుణ్యానా భారీ ప్రాణనష్టం తప్పిందిగానీ, ఈ నాయకులను నమ్ముకుని నిల్చుంటే నట్టేటా మునగడమే తప్ప మరేమీ లేదని తెలుసుకున్న జనం ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకుని బ్రతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.
ముగ్గురున్నా.. సాయం సున్నా..
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పూర్తిస్థాయి సహాయక చర్యలు తీసుకోవడానికి కూడా సిబ్బందిని సన్నద్ధం చేసింది లేదు. డిప్యూటీసీఎం భట్టి కేవలం తన మధిర నియోజకవర్గానికే పరిమితమై పోగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎంచక్కా హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తూ హాట్ ఫిట్ అన్నాడు. ఇక తుమ్మల పాపం వరదల్లో చిక్కుకున్న 9 మందిని రక్షించడానికి నానా అవస్థలు పడ్డా, చివరకు జనం ఆయనను నమ్ముకుని చచ్చే కంటే మనచావేదో మనమే చద్దామని ధైర్యం చేసి పనికి దిగారు. జేసీబీ సాయంతో బాధితులను ఒడ్డుకు చేర్చి, మీ హెలీకాప్టర్లు వద్దు, మీ సాయం వద్దు అంటూ మొహం మీదే చెప్పేశారు.
కార్యక్షేత్రంలో ఇద్దరే…
రాష్ట్రమంతా తీవ్ర వరద విపత్తులో కొట్టుకుపోతుంటే కేబినెట్ లో ఉన్న కేవలం ఇద్దరంటే ఇద్దరే క్షేత్రస్థాయిలో నిలబడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కడికక్కడ తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. ఎల్ఎండీ రిజర్వాయర్ ను సందర్శించి ప్రమాద అంచనాలను తెలుసుకుంటూ ప్రజల చెంత ఉండి ధైర్యం కల్పించారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలకు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇక మరో మంత్రి సీతక్క ఆదివారం ఉదయం నుంచి ప్రతి గ్రామానికి వెళ్లి తానున్నానని ధైర్యం కల్పించారు. రోజంతా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు కావాల్సిన సాయం అందేలా చూశారు. ములుగు జిల్లాలో మొదలైన మంత్రి పర్యటన, పరామర్శలు, ఆదివారం అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లావరకు విరామం లేకుండా సాగాయి. రాత్రి కూడా తను మానుకోటలోనే బస చేసి, ప్రజలకు తానున్నాననే ధీమా కల్పించారు.