Rains | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వర్షాలు కురిసే వేళ, ఉరుములు, మెరుపులు మెరిసే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూదని అధికారులు సూచించారు. వీలైనంత వరకు చెట్లకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. వాగులు, వంకల వద్ద కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, కాచిగూడ, సైదాబాద్, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.