Friday, April 4, 2025
HomeTelanganaHeavy Security | ఏరాయైతేనేం..? సేమ్ టు సేమ్..

Heavy Security | ఏరాయైతేనేం..? సేమ్ టు సేమ్..

Janapadham_EPaper_TS_29-10-2024

ఏరాయైతేనేం..?
సేమ్ టు సేమ్..

రాష్ట్రంలో ప్రకటిత కర్ఫ్యూ

అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్..
నగరంలో కట్టుదిట్టంగా భద్రత..
గుమిగూడితే కేసులే..
సచివాలయం చుట్టూ మరింత నిఘా
షరామాములుగానే ప్రభుత్వాల తీరు..
తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన అంటూ విమర్శలు..

తన మార్కు రాజకీయం. మాట్లాడినంత తేలిక కాదని గ్రహించిన నాయకత్వం. మొదట్లో సెక్యూరిటీ వద్దు., సిగ్నల్ జంపింగ్లు అస్సలే ఉండొద్దు., ట్రాఫిక్ ను నిలుపొద్దు., నేను ఓ సాధారణ వ్యక్తిలాగానే., నా వల్ల జనం బాధపడొద్దు.., అని గొప్పలకు పోయిన రాజులకు ఒక్క దెబ్బతో చుక్కలు కనిపించాయి. గిర్రున కళ్లు తిరిగి కంచెలు వెలిసేలా చేశాయి. మొన్నటి వరకు కలువడానికి ఏమంత ఇబ్బందులు లేని వాతావరణం ఇప్పుడు నిబంధనల ఛట్రంలో బంధించబడి కష్టతరమైంది. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషనో.., లేదంటే పోలీసింగ్ లో సాగుతున్న ఏక్ స్టేట్ రచ్చోగానీ ముఖ్యమంత్రి భద్రత పెరిగింది., రాష్ట్రంలో ప్రకటిత కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

=================

జనపదం, బ్యూరో ఛీఫ్

ప్రజలు ప్రజలే., ప్రభువులు ప్రభువులే. ఏదో ఎన్నికల స్టంట్ కు ఎన్నెన్నో చెప్తారు., అక్కర ఒడ్డెక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతారు. గెలిచిన తర్వాత వెంటనే లేని ఫోజులకు పోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని కొద్దిగా కలరింగ్ ఇస్తూ సమయాన్ని గడుపుతారు. ఒక్కసారి ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఏదన్న సాకు దొరికితే చాలు షరామాములుగానే అంతరాలు వెతుకుతారు., దూరాలు పెంచుతారు.., అంతిమంగా దర్శన భాగ్యాలు అతి కష్టం చేస్తారు. తాజాగా రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూతో అలాంటి వాతావరణమే కనిపిస్తున్నది. మొన్నటి దాకా సర్కార్ పెద్దలను కలవాలంటే కాస్తోకూస్తో తేలిగ్గానే జరిగే పని ఇప్పుడు విపరీతమైన ప్రయాసతో కూడినదిగా మార్చారు.
కంచెలు మొలుస్తున్నాయి..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన కంచెలపై విరుచుకుపడ్డారు. ఇవేమన్నా గడీల పాలనా.., వాళ్లేమన్నా దొరల పెత్తనమా..? అని రోడ్డుపై వెలిసిన ఇనుప కంచెలను ఉన్నఫళంగా తొలగించారు. ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించి శభాష్ అనిపించుకున్నారు. ఇది కదా మేం కోరుకున్న పాలన అని అందరూ సంబురపడేలా నడుచుకున్నారు. కేసీఆర్ గంజిలో ఈగ మాదిరిగా తీసేసేవాడని, మనిషిని కనీసంగా కూడా గుర్తించని పొగరుబోతని దుమ్మెత్తిపోసిన వారు ఇప్పుడు మళ్లీ అదే తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. డోలు పోయి మద్దెల వచ్చింది అన్నట్టుగా ముచ్చటించుకున్నారు.

నగరమంతా అందునా సచివాలయం పరిసరాలన్నీ కంచెలు ఏర్పాటు చేయడంతో ఆ పదేళ్ల రోజులే పునరావృతం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గుమిగూడితే కేసులు., మాట్లాడితే ఎంక్వైరీలు., ప్రశ్నిస్తే కటకటాలు.. అంటూ కొత్త పాలసీకి రేవంత్ సర్కార్ బీజం వేయడంతో ఏ రాయి అయితేనమీ అన్నట్టుగా మారింది పరిస్థితి.

సచివాలయం చుట్టూ నిఘా..
ఇంటిలిజెన్స్ హెచ్చరికలో మరేమోగానీ సచివాలయం చుట్టూరా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఎంతో ఉపశమనం అనిపించిన పరిస్థితిని ఇప్పుడు మళ్లీ కష్టతరంగా మార్చుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేఖ ధోరణి పెరుగుతున్న తరుణంలో నిరసన కారులు ఎదురు తిరుగుతూ సచివాలయం ముట్టడి, ఇతర భవనాల వద్ద గొంతెత్తి నినదించడం చేస్తుండడంతో నిబంధనలకు పదును పెరుగుతున్నది. డీజీపీ కూడా భద్రత చర్యలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఏదిఏమైనా ప్రభుత్వాల మార్పుతో ప్రజలకు ఒరిగిందేమీ ఉండదని, నాయకుల దృష్టిలో జనాలను ఓటర్లుగా తప్ప మరే బంధంతో చూడరనే విషయం కేవలం పదినెలల కాంగ్రెస్ పాలనతోనే తేటతెల్లమైంది.

RELATED ARTICLES

తాజా వార్తలు