హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు సెగలు కక్కుతుండటంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Highest Temperature) నమోదవుతున్నాయి. వరుసగా ఐదో రోజూ 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, నేడు జిగిత్యాల జిల్లా అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీలు రికార్డయింది. భానుడి ప్రతాపానికి వేడి గాలి తోడవడంతో ఉదయం 9 గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కాగా, మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక నల్లగొండ జిల్లా తెల్దేవారపల్లెలో 46.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 46.4, నిజామాబాద్ జిల్లా జకోరాలో 46.4, మంచిర్యాల జిల్లా నాస్‌పూర్‌లో 46.3, పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లిలో 46.1, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండలో 45.9, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లిలో 45.9, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేమాన్‌లో 45.8, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మొత్తం 26 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఈ ఏడాదిలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎండ వేడినుంచి రక్షణ పొందేందుకు చల్లని పానీయాలు సేవిస్తే మంచిదనితెలిపారు. కొబ్బరి బోండా, మంచినీళ్లు, సల్ల, లస్సీ వంటి పానీయలు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని వెల్లడించారు. కాగా, సోమవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana and Hyderabad recorded HOTTEST DAY OF THIS YEAR 🔥🥵 pic.twitter.com/JOzCjyJUzq
— Telangana Weatherman (@balaji25_t) May 4, 2024