హైదరాబాద్: సూర్య ప్రతాపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా (Summer) మారింది. భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ తెలంగాణలో (Telangana) అత్యంత వేడి దినంగా రికార్డయ్యింది. గరిష్ఠంగా సూర్యాపేట జిల్లా మునగాలలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరికొన్ని జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దంచుతున్న ఎండకు వేడి గాలులు తోడంతో ఉదయం 10 గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. వడగాడ్పులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా మునగాలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా నల్లగొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలోని 29 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 17 ప్రాంతాల్లో, యాదాద్రి భువనగిరిలో 6 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
6 నుంచి మోస్తరు వానలు
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. సోమవారం కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగాయి.
శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అకడ వడగాడ్పులు వీస్తాయని చెప్పింది. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. 6 వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఉంటుందని సూచించింది. 4 వరకు జార్ఖండ్‌లో, 3 వరకు కేరళ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.