Hyderabad | హైదరాబాద్ : మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలను నిర్వహించాలనే దానిపై పరిశీలన మాత్రమే జరుగుతుందని, ఇంకా ఆ వేళలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.