Skin Care Tips | ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి రాకముందే రోళ్లు పగిలేలా సూర్యుడు ప్రతాపం (Summer) చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉదయం 11 గంటల తర్వాత బయటికెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. విపరీతమైన వేడికి వడగాలులు తోడయ్యాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని (Skin Care) దెబ్బతీస్తాయి. అలాగే ఈ సీజన్‌లో స్కిన్ ఇన్‌ఫెక్షన్ ముప్పు కూడా పెరుగుతుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, చర్మం నల్లబడటం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. వీటి నుంచి క్షేమంగా బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎండ నుంచి చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
వేసవిలో చర్మ కాంతి తగ్గిపోతుంది. సూర్యరశ్మి, దుమ్ము, అలర్జీ వల్ల చర్మ వ్యాధులూ రావచ్చు. కొందరికి శరీరంపై ఎర్రటి దద్దుర్లు సమస్య కూడా పెరుగుతుంది. ఇది ఎక్కువగా వీపు వెనుక, ముఖం, చేతులపై కూడా కనిపిస్తుంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారా.. అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం దెబ్బతిని ఇలాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సీజన్‌లో సూర్యరశ్మి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. అదేవిధంగా ముఖాన్ని కప్పి ఉంచుకునేలా చూడాలి. బయటికి వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే నీరు తరచూ తాగాలి. సీజనల్ పండ్లతోపాటు పుచ్చకాయ, కీరా దోస వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తినాలి.