DOST | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనుంది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల అనుబంధ కళాశాలలతోపాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలోనూ అడ్మిషన్స్ ఇస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు, కంపార్ట్‌మెంటల్ ద్వారా పాసైనవారు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం మూడు విడుతల్లో ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తారు. జేఎన్‌టీయూహెచ్ అందిస్తున్న బీబీఏ డేటా అనలిటిక్స్ కోర్సులో ఉన్న 60 సీట్లను కూడా ‘దోస్త్’ ద్వారానే భర్తీ చేస్తారు. అదేవిధంగా నాలుగేండ్ల వ్యవధి గల బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉన్నది. వీటిల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌లో ఎలా రిజిస్ట్రేషన్ (DOST Registration) చేసుకోవాలో చూద్దాం..
దోస్త్ రిజిస్ట్రేషన్ ఇలా..
- విద్యార్థులు ముందుగాతమ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దోస్త్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. ఐడీ, పిన్ జనరేట్ చేసుకోవాలి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి.
- అనంతరం దోస్త్ ఐడీ, పిన్ ద్వారా లాగిన్ అయితే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. దానిని నింపిన
- తర్వాత విద్యార్థి కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి.
- విద్యార్థి మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ అలాట్ అవుతుంది.
- విద్యార్థులు తాము పెట్టుకున్న కాలేజీలో సీటు వస్తే అక్కడికి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. కాలేజీలో సర్టిఫికెట్లు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.dost.cgg.gov.in