హైడ్రా… వెరీ స్పీడ్…
దాటిగా కూల్చివేతలు..
ఫిర్యాదు అందగానే కదలిక…
ముందు నోటీసులు.. ఆ పై చర్యలు..
దూకుడు పెంచిన కమిషన్
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పావులు..
సర్కార్ చర్యలపై సర్వత్రా సంబురాలు..
హైడ్రా హైస్పీడ్ లో దూసుకెళ్తోంది. అక్రమం అని తెలిస్తే చాలు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఫిర్యాదు అందితే చాలు పరిశీలించడం., విచారణ చేయడం., నిజమే అనిపిస్తే బాధ్యులకు వివరణ కోసం సమయం ఇవ్వడం.. అన్నీ చకచకా చేస్తున్నది. చెరువులను చరబట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిన సీఎం ఆ దిశగా హైడ్రాకు పూర్తి అధికారులు కల్పించడంతో హైదరాబాద్ చుట్టు పక్కల కబ్జాదారులు సెట్ రైట్ అవుతున్నారు. కొందరు స్వచ్ఛందంగా ఒప్పుకుంటుండగా, మరికొందరు రాజకీయంగా పలుకుబడి ఉపయోగించేందుకు విఫల యత్నం చేస్తున్నారు. అసలే వర్షాలు, అందులో వరదల తాకిడికి ఆగమాగం అవుతున్న జనజీవనాన్ని చెరువులు ఎంత మేరకు ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యక్షంగా అనుభవంలో చూస్తున్న నేపథ్యంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న హైడ్రాకు ఎవరూ అభ్యంతరం చెప్పకుండా తోడ్పాటు అందిస్తుండడం కొసమెరుపు.
============================
జనపదం, హైదరాబాద్
హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమం అని తెలిస్తే చాలు దూకుడుగా వెళ్లి చేయాల్సిన పని చేసుకుని వస్తున్నది. ప్రజల సౌకర్యాలే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ముందుకెళ్తున్న హైడ్రా చెరువులు, కుంటల రూపురేఖలను తిరిగి పొందుపర్చడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నది. రాజకీయ పలుకుబడి, కోట్లకు పడగలెత్తిన తలబిరుసు, అడిగేవారు లేరులే అనే తెగింపుతో చెరువులు, కుంటలు, నీటి జాడల ప్రాంతాలను చెరబట్టిన వారిపై కొరఢా ఝులిపిస్తున్నది. నగర శివార్లలో ఉన్న కుంటలను రక్షించడమే ధ్యేయంగా అక్రమంగా వెలసిన ఆకాశహర్మ్యాలను నేలమట్టం చేస్తున్నారు.
ఫిర్యాదు అందగానే కదలిక…
చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో అక్రమ కట్టడం ఉన్నదని ఫిర్యాదు అందితే చాలు హైడ్రా ఏ మాత్రం తటపటాయించకుండా దూసుకెళ్తున్నది. ఫిర్యాదు అందిన ప్రాంతానికి వెళ్లి కట్టడాలను పరిశీలించి నిపుణుల, సంబంధిత శాఖల ప్రమేయంతో విచారణ చేపడుతున్నది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యానికి తావివ్వకుండా తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఫిర్యాదు దారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా, ఉత్సాహంగా మరేదైనా అక్రమం గురించి చెప్పే విధంగా ఉండేలా కూల్చివేతలకు ప్లాన్ చేస్తున్నది. రాజకీయంగా ప్రమేయాలను పట్టించుకోకుండా, తనపని తాను చేసుకుంటుపోతున్నది. ముందగా నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేయడమే పనిగా పెట్టుకుని సామాన్యుడికి నమ్మకం కలిగిస్తున్నది.
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పావులు..
హైడ్రా తీరుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్న హైడ్రాను ఓ వరంగా భావిస్తున్నారు. ప్రకృతిని చెరబట్టిన వారి పాలిట యమపాశంగా మారిన కమిషన్ ప్రజా ఆస్తులను కాపాడడమే పనిగా పావులు కదుపుతున్నది. చెరువులు, కుంటల నిజ పరిమాణం, నీటి నిల్వ సామర్థ్యం, అక్రమార్కుల చేతిలోకి వెళ్లిన స్థలం వంటివన్నీ లెక్కలు తీసి మరి ఎవరి తప్పుకు వారే బాధ్యులుగా చేసి కబ్జాదారుల గుండెల్లో గుబులుపుట్టించి వారంత వారే కూల్చివేతకు అనుమతించడం, లేదంటే వారే కూల్చేలా ప్రేరేపిస్తు పనిని సులభం చేస్తున్నది.