JANAPADHAM_TS_29-08-2024 E-Paper
కూల్చుడే..?!
ఏ క్షణమైనా జేసీబీలతో అటాక్..?
జన్వాడపై హైడ్రా ఫోకస్..
కూల్చివేతలపై సీరియస్ గా ఉన్న సీఎం..
కేటీఆర్ ఫాం హౌస్ పై స్పెషల్ ఫోకస్..
స్పీడ్ స్పీడ్‌గా సర్వే..
రెండు రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ సంయుక్త పరిశీలన..
ప్రభుత్వ పోకడలతో కూల్చుడు ఖామేనని చర్చ..
ఇప్పటికే హైడ్రా ఫిక్స్ అయిందంటూ గుసగుసలు..
డాక్యుమెంట్ పరిశీలించి చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు..
జనపదం, బ్యూరో: జన్వాడ ఫాం హౌస్ రాజకీయ దుమారం రేపుతోంది. హైడ్రా చర్యలు ఏంటి..? ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కేటీఆర్ తన ఫౌమ్ హౌజ్ కాదని చెబుతుంటే.. అధికార పార్టీ మాత్రం అది కేటీఆర్ దేనంటూ చెప్పుకొస్తోంది. దీనిపై జన్వాడ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు బుల్డోజర్లతో దూసుకోస్తుందనే ఆందోళన మొదలైంది. హైకోర్టు సర్వే చేసిన అనంతరమే చర్యలు తీసుకోవాలని సూచించడంతో.. ఇప్పటికే రెండు సార్లు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేలు చేపట్టారు. అధికార పార్టీ ఫోకస్ అంతా జన్వాడపైనే ఉండడంతో ఎప్పుడైనా కేటీఆర్ ఫాం హౌస్ కూల్చే అవకాశం లేకపోలేదనే సమాచారం.
111 జీవోకు విరుద్ధంగా..
మాజీ మంత్రి కేటీఆర్ ఈ జన్వాడలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాం హౌస్ నిర్మించారనే ఆరోపణలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నది. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్‌ది కాదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే జన్వాడ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తమ ఫామ్ హౌజ్ నిబంధనలకు లోబడే ఉన్నదని, తన ఫామ్ హౌజ్, పొలం ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారించిన కోర్టు సర్వే చేయాలని, డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాతే కూల్చివేత చేపట్టాలని సూచించింది. అంతేకాదు.. హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, దాని చట్టబద్ధత ఏమిటని, పరిమితులు ఏమిటని ప్రశ్నించింది. అయితే, ఆక్రమణలను అడ్డుకునే లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపింది. ఇక నిర్మాణాలకు ఒక శాఖ అనుమతులు ఇస్తుంటే.. మరో శాఖ కూల్చివేస్తున్నదా? అని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని హైడ్రాను ఆదేశించింది. ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలను కూల్చివేసిందని, అందుకు పాటించిన నిబంధనలు ఏమిటో తెలియజేయాలని అడిగింది.
సీరియస్ గా సర్వే..
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్‌హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలా పరిసర ప్రాంతాలను నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా బఫర్ జోన్‌లో నిర్మించారని నీటిపారుదల శాఖ అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. మంగళవారం సాయంత్రం సర్వే చేసిన అధికారులు మరోసారి బుధవారం మధ్యాహ్నం సర్వే చేశారు. ఆరుగురు అధికారుల బృందం సర్వే నిర్వహించింది. ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు, నలుగురు రెవెన్యూ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.
డీజీపీఎస్ తో..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలను సుమారు కిలోమీటర్ వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నాలా పరిధిలోకి ఏయే సర్వే నంబర్లు వస్తున్నాయో ఆ వివరాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ నక్షాను తీసుకుని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం(డీజీపీఎస్) పరికరంతో అధికారులు సర్వే నిర్వహించారు. ఎప్పటికప్పుడు సర్వే వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గ్రామంలో వెట్ ల్యాండ్, డ్రైల్యాండ్ వివరాలతో పాటు బుల్కాపూర్ నాలా వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. రెండు, మూడు పాత మ్యాప్‌లను కూడా అధికారులు వెంట తీసుకుని వచ్చారు. వాటి ఆధారంగా గతంలో బుల్కాపూర్ నాలా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండేది. ప్రస్తుతం ఎంత వరకు ఉందనేది తెలుసుకున్నారు. గతంలో ఎంత వెడల్పులో ఉండేది ప్రస్తుతం ఎంత వరకు ఉందని చూశారు. బఫర్ జోన్ పరిధిలో ఏ మేరకు నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. తదితర వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని అధికారులు వివరించారు. పూర్తిస్థాయి సర్వే తర్వాత బుల్కాపూర్ నాలా ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. గతంలో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉద్ధృతిని నివారించేందుకు నీటిని బుల్కాపూర్ నాలా ద్వారా మళ్లించేవారు.
బఫర్ జోన్ లోకి వచ్చే ఛాన్స్..
ఈ నాలా ప్రస్తుతం 24 కిలోమీటర్లు మేర ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఫాంహౌస్ ప్రధాన గేటు సమీపంలోనే నాలా ఉండడంతో బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలా పరిధిని చూస్తే 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని నీటిపారుదల, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని.. కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు సదరు నివేదికలో తెలిపారు. అలాగే ఈ నాలాకు రెండు వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్‌జోన్ ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఫామ్‌హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్‌జోన్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ ప్రహరీగోడను నాలాతోపాటు బఫర్‌జోన్‌లో నిర్మించారని పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో కానీ తనకు ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని చెప్పారు. ఆ ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తానని కేటీఆర్ చెప్పారు.
సీఎం వ్యాఖ్యలతో…
జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమన్నారు. రూల్స్ అతిక్రమించి కట్టిన ఫామ్ హౌస్‌ను కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆక్రమణలు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. దీంతో కేటీఆర్ ఫాం హౌస్ కూల్చివేత తప్పదనే చర్చ సాగుతోంది. ఇక అసదుద్దీన్ ఓవైసీ సైతం కోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజేశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులివ్వగా హైకోర్టు స్టే విధించింది.
ఏ క్షణమైనా..?
ప్రదీప్ రెడ్డి జన్వాడ ఫాం హౌస్ కూల్చొదంటూ కోర్టులో కేసు వేసినా ఊరటలభించలేదు. ఎందుకంటే ఫాంహౌస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించకుండా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాంహౌస్ లోకి ఎంటరయ్యారు. ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా జన్వాడ ప్రాంతంలో పరిస్థితిని రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు. కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది? ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు? లాంటి విషయాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. కూల్చివేతకు ఎన్ని యంత్రాలు అవసరం అనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైన కూల్చివేస్తారనే టాక్ నడుస్తుండడంతో.. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చెల్లెలు కవితకు బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా కేటీఆర్ లో లేకుండా పోయింది. మరి కొలతలు తీసుకుంటున్న ఇరిగేషన్ అధికారులు ఫైనల్ గా ఏమి తేలుస్తారో చూడాల్సిందే.