ఉసురు తాకిపోతవ్..
రేవంత్ కు బాధితుల శాపనార్థాలు..
పేదల కన్నీరుమున్నీరు..
కోడలు గర్భిణీ కనికరించండి…: ఓ మహిళా ఆవేదన
రోడ్డున పడ్డ సామాన్యులు..
దూడుకు పెంచిన హైడ్రా..
అర్ధరాత్రి వరకు హల్ చల్..
ఆదివారం 44 ఆక్రమణల కూల్చివేతలు…
8 ఎకరాలు స్వాధీనం..
‘‘నువ్వేదో చేస్తవని ఆశపడితే కొంపలు గూల్చి బజార్నేసినవ్. నిన్ను నమ్ముకున్నందుకు మంచిగనే బుద్ధి చెప్పినవ్. మా బతుకులు మొత్తం మట్టిపాలు చేసినవ్. మా ఇండ్లు కూల్చిన నీ సర్కార్ కూడా తప్పకుండా కూలుద్ది. నువ్వు ఎక్కువ రోజులు ఉండవ్. ఉసురుతాకి తప్పకుండా పోతవ్…’’ అని పేదలంతా శాపనార్థాలు పెట్టారు. సీఎం తీరును అసహ్యించుకుంటూ దుమ్మెత్తిపోశారు. కనీసం గర్భిణీ., ఆడవారు అనే కనికరం కూడా చూపకుండా అధికారులు ప్రదర్శించిన దూకుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎక్కడికక్కడ సామాన్లు చెల్లాచెదరు చేస్తూ, అడ్డం వచ్చిన వారిని లాగేస్తూ హైడ్రా అండ్ టీమ్ చేసిన బీభత్సం కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహావేశాలకు తావిచ్చింది. బడా బాబులకు సమయమిస్తూ, కనీసం తమగోడు కూడా చెప్పకుండా, సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన అతిని బాధితులంతా తిట్టిపోస్తున్నారు.
=======================
జనపదం, బ్యూరో
హైడ్రా కూల్చివేతలు పేదోళ్ల పొట్ట గొడుతున్నవి. తిండి తిప్పలు మాని, ఆరు గాలం శ్రమించి పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలమట్టం అవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలతో కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాలన్నీ గరీబోడి ఆవేదన, రోదనలతో ప్రతిధ్వనించాయి.
ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి…? మీరు వస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఓటేసిన. కానీ, ఇట్లా చేస్తావనుకోలే. సామాన్లు తీసుకునేందుకు మాకు కొంత టైం ఇవ్వండి. మా కోడలు ఐదు నెలల గర్భవతి, ఉన్నఫళంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని…. ఓ మహిళ బోరున విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. నిరాహార దీక్ష చేసి కేసీఆర్ నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తే.. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పేదలను పీడిస్తున్నారంటూ.. బాధితులు గగ్గోలు పెట్టారు. తమ బతుకులు రోడ్డుపై పడుతున్నా ముఖ్యమంత్రి కనికరించడం లేదని కన్నీరుపెట్టుకున్నారు.
44 అక్రమ నిర్మాణాల నేలమట్టం..
ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఇవాళ మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. కూకట్పల్లి నల్లచెరువులో 4 ఎకరాలు, అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్గూడలో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించినట్లు హైడ్రా తెలిపింది.
నీటి వనరుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా 12 రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ మహానగరంలో పంజా విసిరింది. మూడు చోట్ల బుల్డోజర్లతో విరుచుకుపడి, పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ప్రకటన
ఈ మేరకు ఆదివారం జరిగిన కూల్చివేతలకు సంబంధించి వివరణ ఇచ్చిన హైడ్రా, ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించామని, వాటిని కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించారని హైడ్రా పేర్కొంది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. అలాగే పటేల్గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
8 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం..
ఈ మూడు ప్రాంతాల్లో మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా వివరించింది. రెవెన్యూ, నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సంయుక్తంగా మూడు చోట్ల ఆపరేషన్ చేపట్టామని హైడ్రా వెల్లడించింది. నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడటమే తమ లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడి రెండు నెలలు పూర్తైంది. ఇప్పటి వరకు 26 చోట్ల 306 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసింది. 119 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి విడిపించింది.
కూకట్ పల్లిలో కూల్చివేతలు ..
నల్లచెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో రంగంలోకి..
7 ఎకరాలు కబ్జా
సమాచారం ఇస్తే సామాన్లు సర్దుకునే వాళ్లం : బాధితుల ఆవేదన
కూకట్ పల్లి నల్లచెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్(హైడ్రా) కూల్చివేతలు చేపట్టింది. ఆదివారం తెల్లవారుజామునే అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
నల్లచెరువు 7 ఎకరాలు కబ్జా
కూకట్ పల్లిలోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉందని,
దీనిలో ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో 7 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని హైడ్రా అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే నల్లచెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేశామని హైడ్రా అధికారులు తెలిపారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి మిగతా 16 షెడ్లను కూల్చివేశామన్నారు.
నోటీసులు ఇస్తే వెళ్లిపోయేవాళ్లం : బాధితులు
కూకట్ పల్లి నల్లచెరువు వద్ద కూల్చివేతల సమయంలో ఇక్కడి బాధితులు కన్నీరుపెట్టుకున్నాడు. ఈ స్థలాలను లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సామగ్రి తీసుకువెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా కూల్చివేశారని కంటతడి పెట్టుకున్నారు. తమకు నోటీసులు జారీ చేసి సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లమన్నారు. తమకు భూమిని లీజుకు ఇచ్చిన యజమానులు సైతం ఈ స్థలం ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లోకి రావంటూ చెప్పడంతోనే తీసుకుని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాటరింగ్ షెడ్డును ఖాళీ చేయడానికి నెల రోజులు సమయం ఇవ్వాలని బాధితులు అధికారుల కాళ్ళ మీద పడి వేడుకున్నా అధికారులు కనికరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతంలోనే వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.