Friday, April 4, 2025
HomeTelanganaDemolitions | గూడు చెదిరే.. గుండె కరిగే..

Demolitions | గూడు చెదిరే.. గుండె కరిగే..

JanaPadham_EPaper 25-09-2024

గూడు చెదిరే.. గుండె కరిగే…
ఆగని కూల్చుడు…

హైడ్రా బరితెగింపు..
కొంపలు కూల్చుడే పనిగా దూకుడు…
సామాన్యుడి అంతు చూస్తున్న కమిషన్…
ఆజ్యం పోస్తున్న రాష్ట్ర సర్కార్..
హైదరాబాద్ ప్రజలపై ప్రభుత్వ కత్తి..
విచ్చలవిడి నిర్ణయాలతో జనజీవనం అస్తవ్యస్తం..
చెట్టుకొకరు పుట్టకొకరుగా విలపిస్తున్న ప్రజలు..
తాజాగా మూసీలో 16 వేల ఇళ్ల కూల్చివేత..?
నిన్న ఇబ్రహీం పట్నంలో 500 కూల్చివేతలు..

హైడ్రా బరితెగించింది. కూల్చుడే పనిగా, నేలమట్టం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న తీరుగా వ్యవహరిస్తున్నది. అందునా సామాన్యుడు ఏడుస్తుంటే సరదాగా చూడాలనే పైశాచిక ఆనందం పొందుతున్నది. బడా బాబుల జోలికి వెళ్లడానికి నత్తనడకన సాగుతున్న యంత్రాలు., నిరుపేదల గూడు కూల్చడానికి మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. రోజుకో ఏరియాలో వేల సంఖ్యలో ఇండ్లను నేలమట్టం చేస్తూ గుండెలు పగులగొడుతున్నాయి. గూడు చెదిరిన బీద పక్షులు నెత్తినోరు కొట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటే తమకేమీ పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుండగా, జీవితాలు తారుమారై భార్యబిడ్డలతో రోడ్డున పడ్డ కుటుంబాలు తలదాచుకోవడానికి చోటెక్కడ దొరుకుతుందో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుర్గం చెరువులో కూల్చివేతలకు ముహూర్తం అడ్డొస్తున్నట్టుగా వెనుదిరిగిన బుల్డోజర్లకు మూసీ వెంట, ఇబ్రహీం పట్నంలో బీదవాడి కొంపలు కూల్చడానికి మాత్రం ఏ అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయాయి. హైడ్రా కమిషనర్ కూడా పెద్దోళ్లను పట్టించుకోకుండా, పేదలపైనే ప్రతాపం చూపుతూ ఎక్కడ లేని న్యాయం చేస్తున్నట్టుగా ఫోజు కొడుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సొంతింటి కల సాకారం చేసుకునే బీదలకు లోన్లు ఇవ్వొద్దనే ఉచిత సలహాలు ఇస్తూ ఆయన ప్రదర్శిస్తున్న పెద్దరికాన్ని పలువురు మరింత విచిత్రంగా చెప్పుకుంటున్నారు.

జనపదం, బ్యూరో

రెక్కలు ముక్కలు చేసుకుని, పైసాపైసా పోగేసుకున్న కష్టంతో కట్టుకున్న కలల సౌధం కళ్ల ముందే కూల్చుతుంటే., అప్పటి వరకు తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో సంతోషంగా గడిపిన మధుర క్షణాలను బుల్డోజర్ల రూపంలో వచ్చిన కింకరులు దూరం చేస్తూ.., ప్రాణంగా, పెద్దల గుర్తులకు నిలయంగా భావించిన కొంపలను ఆనవాళ్లు కూడా లేకుండా నేలమట్టం చేస్తే.., ఆ కష్టం పగోడికి కూడా రావొద్దు., అలాంటి పరిస్థితి మరే మనిషికి కలుగొద్దు. కానీ, హైడ్రా సాగిస్తున్న విశృంఖల పర్వంలో హైదరాబాద్ లో చిరు కొంపల్లో కాపురం వెళ్లదీస్తున్న వారు వణికిపోతున్నారు. తెలిసీ తెలియక, ఓ నాలుగు తక్కువ డబ్బులకు జాగాలు వస్తున్నాయని ఆశతో కొనుక్కున్న స్థలాల్లో కష్టంతో కట్టుకున్న ఇండ్లను హైడ్రా అధికారులు కూలగొడ్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండి పోతున్నారు. తమకు కాస్త సమయమివ్వండి, మీకు శ్రమ లేకుండానే పని పూర్తి చేసుకుంటాం.. అని కాళ్లవేళ్లా పడి బతిమిలాడినా కనికరించకుండా ఏదో సాధించిన వారి మాదిరిగా యంత్రాంగం సాగిస్తున్న దమన నీతి కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

బరితెగింపు..
బరితెగించిన హైడ్రా కూల్చివేతల్లో దూసుకెళ్తున్నది. టార్గెట్ పెట్టుకున్న సంస్థ మాదిరిగా అత్యంత వేగంగా నేలమట్టం చేయడంపై దృష్టి సారించి సాగుతున్నది. ఎక్కడికక్కడ ఇండ్లను కూలగొడుతూ పేద ప్రజలను రోడ్డుపై పడేస్తున్నది. గూడు చెదిరిన జనం గుండెలు పగిలి చస్తుంటే తమకేమీ పట్టనట్టుగా ముందుకెళ్తున్నది. హైడ్రా కమిషన్ కు సర్కార్ మరింత వెన్నుదన్నుగా నిలుస్తూ గో ఏ హెడ్.. అన్నంత స్వతంత్రాన్ని ఇచ్చి వేడుక చూస్తున్న సందర్భంలో తమను ఎందుకు ఇలా చేస్తున్నారో., తాము చేసిన తప్పేంటో అర్థం గాక బాధితులు లబోదిబోమంటున్నారు. దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటున్న జీవితానికి ఇప్పుడు కేరాఫ్ ఫుట్ పాత్ అనేలా చేస్తున్న యంత్రాంగాన్ని ఏమీ చేయలేక, కడుపులో యతను ఆపుకోలేక శాపనార్థాలతో సరిపెట్టుకుంటున్నారు.

తాజాగా మూసీలో 1600 ఇళ్ల కూల్చివేత..?
మూసీ పరివాహకంలోని 1600 ఇండ్లను కూల్చివేయాలని హైడ్రా నిర్ధారించుకున్నది. ఇప్పటికై స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకుని పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోతున్నది. ప్రజల నుంచి వ్యతిరేక పెరుగుతున్న నేపథ్యంలో పనిని త్వరగా పూర్తి చేయడానికి కావాల్సిన యంత్రాలను భారీగా తెప్పించుకోవడానికి ఇండెంట్ కూడా సిద్ధం చేసుకున్నది. తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేసి, వ్యతిరేక పెల్లుబికకముందే అక్కడ నుంచి విజయగర్వంతోవెనుదిరగాలనే ఎంతో ముందు చూపుతో బుల్డోజర్ల సంఖ్యను అమాంతంగా పెంచడానికి నిర్ణయం తీసుకుని సర్కార్ కు నివేదించుకున్నది. ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ డోజర్ల మాదిరిగా చేపట్టిన కార్యాన్ని మరపించేలా హైడ్రా రాష్ట్ర చరిత్రలో యంత్ర కూల్చివేతలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించే దిశగా ముందుకెళ్తున్నది.
అలాగే రెండు రోజుల కిందట ఇబ్రహీం పట్నం పరిసరాల్లో సుమారు ఐదు వందలకు పైగా ఇండ్లను నేలమట్టం చేశారు. హైడ్రా దూకుడుతో ఒక్కసారిగా పరిస్థితి అర్థం గాక జనం విస్తుపోయి చూస్తుండగానే తనపనిన తాను పూర్తి చేసుకుని అధికారులు వెనుదిరిగారు. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం కావడంతో ఆడవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సందర్భంలో ఓ గర్భిణీ కనీసం ఇంటి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఆగలేనంత బిజీగా యంత్రాంగం తన ప్రతాపాన్ని ప్రదర్శించి పైశాచికత్వాన్ని చూపింది.

హైడ్రా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నది. ఉన్నవారిని చూసీ చూడనట్టుగా, పేదలంటే మాత్రం ఎక్కడలేని శక్తిని కూడగట్టుకున్న దాని మాదిరిగా రెచ్చిపోతున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. నిత్యం ఏదో ఓ ఏరియాలో కూల్చివేతలే పనిగా, పగబట్టిన వాడిగా సాగుతున్న తీరుపై సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు