Click to view: JanaPadham_EPaper 29-09-2024
Click to view: Janapadham_2Pm_News 29.09.2024
పైశాచికం..?
మూసీతో సర్కార్ కు మూడినట్టేనా..?
ముదురుతున్న హైడ్రా…
కూల్చివేతలపై భగ్గుమంటున్న బాధితులు
నిద్రలేని రాత్రులు గడుపుతున్న నిర్వాసితులు
నగరం నలుమూలలకు విస్తరిస్తున్న ఆందోళనలు
సర్కారు మెడకు బుచ్చమ్మ ఆత్మహత్య వ్యవహారం
కూల్చివేతలకు రాజకీయ రంగు
తెలంగాణ భవన్ కు బాధితుల క్యూ
నేలమట్టాలపై పునరాలోచనలో సర్కార్..?
నగరంలో 28వేల అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ప్రణాళిక..?
రాజధాని వైపు రాష్ట్రం చూపు
రంగనాథ్ పై మానవహక్కుల కమిషన్ కేసు నమోదు..
గాలికిపోయేది దేనికో తగిలించుకున్నట్టుగా., గోటితో పోయేది మరెక్కడిదాకో తీసుకుపోయినట్టుగా ఉంది రాష్ట్ర సర్కార్ వ్యవహారం. హైడ్రా అంటూ హడావుడి చేస్తున్న యంత్రాంగం పర్యవసనాలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ఆలోచన మంచిదే కావొచ్చుగాక, ఆచరణలో వ్యత్యాసాలే సర్కార్ ‘కొంప’ ముంచబోతున్నట్టుగా మారుతోంది. పైసాపైసా కూడేసి, రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న ఇండ్లు అడ్డూఅదుపు లేకుండా నేలమట్టం చేస్తున్న తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బలిసినోడిని వదిలేసి, బక్కపేదోళ్లను బలితీసుకుంటున్న తీరే తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. స్పష్టత లేక.., సాహసం చేయరా.. డింభకా.. అన్నట్టుగా సాగుతున్న కమిషన్ దూకుడు దుమ్మెత్తిపోసేలా చేస్తున్నది. కనిపిస్తే చాలు ముఖాన ఉమ్మేసే పరిస్థితులు దాపురించాయి. బిడ్డ, భార్యలతో రోడ్డున పడ్డ బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు చూస్తున్న వారికే కంటతడి పెట్టుస్తున్నాయి., ఇక పైనునోళ్లకు ఏ మాత్రం చలనం లేకుండా ఎలా ఉంచగలుగుతున్నాయో అర్థం కాని విచిత్రి. హైడ్రా కూల్చివేతలతో సాధించబోయేది ఏంటోగానీ, బతుకులను మాత్రం రోడ్డున పడేస్తున్న వికృత క్రీడ మాత్రం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయింది.
==================
జనపదం, బ్యూరో
హైడ్రా హైరానా పడుతోంది. రాష్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోన్న హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని తీరుపై మొదలైన ఆందోళనపర్వం నగరం నలుమూల విస్తరిస్తున్నది. ప్రస్తుతం వ్యవహారం కాంగ్రెస్ సర్కార్ కు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న ఆ వ్యవస్థ పనితీరు వివాదస్పదమవుతున్నది. రోజు రోజుకు చేస్తోన్న కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోన్న హైడ్రా..బుల్లెట్ లా దూసుకెళ్తున్నది. మరోవైపు హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడుతోన్న కుటుంబాలు ఆందోళనబాట పట్టడం
వివాదస్పదమవుతున్నది. తాజాగా హైడ్రా తన ఇంటిని కూల్చివేస్తుందనే భయంతో కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారితో కలిసి పోరాటానికి సిద్ధమవుతోన్న విపక్ష పార్టీల పోరుబాట రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందోననే ఆసక్తి నెలకొన్నది. మరోవైపు ఎఫ్ టీ ఎల్ స్థలాల్లో నిర్మించిన పేదల నివాసాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్.. నిర్వాసితుల ఆందోళన వెనక పెద్ద హస్తం ఉందనీ.. త్వరలోనే వారిపైనా చర్యలుంటాయని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ మొదలైంది. మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా అక్రమ నిర్మాణాల కూల్చివేస్తామన్న కమిషనర్ దూకుడుకు బాధితులు, రాజకీయ పార్టీలు బ్రేక్ వేస్తారా..? అనే ఉత్కంఠ నెలకొన్నది. నగరంలో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన హైడ్రా.. ఏ రోజు,ఏ క్షణం తమ ఇళ్లను కూల్చివేస్తుందోననే భయంతో చెరువులు, కుంటలు, నాలాల పరిసర ప్రాంతాల్లో నివసిస్తోన్న వారు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రైవేట్ ఫెనాన్సులు తీసుకుని, ఉన్న ఆస్తులు అమ్మి నిర్మించుకున్న ఇళ్లను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ నిర్వాసితులు ఆందోళనబాట పడుతున్నారు. ఉన్న ఫళంగా తమ నివాసాలను కూల్చేస్తే ఎక్కడికి పోవాలంటూ పలుచోట్ల అధికారులను ఘెరావ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు దిగుతున్నారు. అయినా ఎలాంటి బెదిరింపులు, కనికరం చూపని హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.
కూల్చివేతలకు రాజకీయ రంగు..
హైడ్రా కూల్చివేతలకు రాజకీయ రంగు అద్దుకుంటోంది. గతంలో హైడ్రా పనితీరును ప్రశంసించిన ప్రజలు, ప్రజాప్రతినిధులే తాజాగా హైడ్రా చర్యలను తప్పుబట్టడం ఆ వ్యవస్థను ఇరకాటంలో పడేస్తున్నది. రాజకీయ నేతలు, కంపెనీలు, సెలబ్రెటీల నిర్మాణాల జోలికి వెళ్లని హైడ్రా.. కేవలం పేదల ఇళ్లపైనే బుల్డోజర్లతో దాడికి దిగుతుందనే అపవాదను మూటగట్టుకున్నది. తాజాగా నిర్వాసితులందరూ ఆందోళనకు సిద్ధమవుతుండడం.. హైడ్రా నుంచి తమను కాపాడాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శనివారం ఉదయం భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ కు వెళ్లిన బాధితులు, నిర్వాసితులు అక్కడ తమ గోడును విన్నవించుకోవడం రాజకీయాలను కుదిపేసింది. ఇటు హైడ్రా బాధితులకు అండగా నిలిచిన బీజేపీ సైతం బాధితులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతున్నది. అధికార కాంగ్రెస్ కు మిత్రపక్షమైన సీపీఐ సైతం హైడ్రా చర్యలను తప్పుబట్టింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలు హైడ్రా బాధితులకు అండగా, వారితో కలిసి ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తున్నది. తాజాగా బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదని కమిషన్ రంగానాథ్ తో ప్రకటన చేయించిన ప్రభుత్వం కొన్ని రోజులు కూల్చివేతలు బ్రేక్ వేద్దామనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
అక్రమ కట్టడాలు 28వేలకు పైనే..
ప్రస్తుతం నగరంలో అక్రమ నిర్మాణాల సర్వే ముమ్మరం చేసిన ప్రభుత్వం 28వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని కూల్చేస్తామని మంత్రి పొన్పం ప్రభాకర్ ఈ నెల 27న సచివాలయం వేదికగా స్పష్టం చేశారు. తాజాగా ఏవీ రంగనాథ్ సైతం అవాంతరాలను అధిగమించి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు తమ నివాసాలను హైడ్రా బారి నుంచి కాపాడుకునేందుకు కొంతమంది ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తుంటే.. ఇంకొందరు ఇళ్ల వద్దకు చేరుకుంటోన్న అధికారులను అడ్డుకుంటూ.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరను సర్కార్ కొనసాగిస్తుందా..? బ్రేక్ వేస్తుందా..? అనే చర్చ జరుగుతున్నది.