Wednesday, January 1, 2025
HomeTelanganaKCR | నేను హిందువునే కానీ.. తెలంగాణ ప్రజల ఆత్మబంధువుని.. నిజామాబాద్‌ రోడ్‌షోలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR | నేను హిందువునే కానీ.. తెలంగాణ ప్రజల ఆత్మబంధువుని.. నిజామాబాద్‌ రోడ్‌షోలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR | నేను హిందువునే.. కాదని కాదు.. కానీ, తెలంగాణ యావత్‌ ప్రజల ఆత్మబంధువునని.. ఏ ఒక్క వర్గానికో కాదు.. తెలంగాణలోని ప్రజలంతా బాగుపడాలి అన్ని వర్గాలు బాగుండాలని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఆవేశంలో ఓటు వేయకుండా ప్రజాస్వామ్య పరిణితి, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్ర భవిత ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో కూలంకషంగా చర్చించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాను హిందువునేనని.. హిందువును కాదని కాదు.. యావత్‌ ప్రజల ఆత్మబంధువునన్నారు. ఏ ఒక్క వ‌ర్గానికో కాదని.. రాష్ట్రంలోని ప్రజలంతా బాగుపడాలన్నారు. అన్ని వర్గాలు బాగుండాలన్న ఆయన.. హిందూ ముస్లిం భాయ్‌ భాయ్‌ ఉండాలని.. అందరూ కలిసి బతకాలన్నారు. దాంట్లోనే గొప్పత‌నం, బ‌లం ఉంటుందని.. కానీ ప్రజ‌ల‌ను విడ‌దీసేలా మ‌త‌విద్వేషాలు రెచ్చగొడితే ఏం లాభం ఉండదన్నారు. ఇక్కడి ఎంపీ నోరు తెరిస్తే ఎలాంటి మాటలుంటాయో.. గందరగోళం ఉంటుందో తెలుసునన్నారు. అన్ని విషయాల్లో మోదీని వ్యతిరేకించిన కాబట్టే తన కూతురు కవితను అరెస్టు చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు.

దానికి తాను నేను భయపడనని.. కాంప్రమైజ్‌ కాబోనన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో పోరాటం చేస్తా త‌ప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోలేదన్నారు. ఇప్పుడు సైతం లొంగిపోయే ప్రసక్తే లేదని.. ఆరు నూరైనా స‌రే లొంగిపోనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి మెజారిటీ రావడం లేదని.. ఎన్‌డీఏ కూటమికి 250 కంటే మించి సీట్లు రావని.. బీఆర్‌ఎస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గవ‌ర్నమెంట్ రాదని.. ప్రాంతీయ శక్తులే ఏర్పాటు చేసే గవర్నమెంట్‌ వస్తుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ది కీలకపాత్ర అవుతుందని.. ఈ రాష్ట్రంలో బీజేపీ వారిని ఓడించింది బీఆర్ఎస్సే. కాంగ్రెస్ కాదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కవుతాయని.. మోసం చేస్తాయని విమర్శించారు. ప్రస్తుతం రైతులకు రైతుబంధు ఎలా వేస్తున్నారో.. అలాగే హామీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్ అయితేనే.. పేగులు తెగేదాకా కొట్లాడుతుందని.. నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు