హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు సమస్య, మంచినీటి కొరత విషయంలో తాను చెప్పింది తప్పని సీఎం రేవంత్ కానీ, ఓయూ అధికారులు కానీ రుజువు చేస్తే చంచల్‌గూడ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తాను చెప్పింది నిజమైతే సీఎంను చంచల్‌గూఐడ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఫోర్జరీ చేయడం నేరమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ నోటీసులు తయారు చేసిన సీఎంపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మార్చి 18న ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. నెల రోజులపాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేస్తున్నాం. తీవ్రమైన నీటి కొరత, విద్యుత్ సమస్య ఉందని, విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి అధికారులకు సహకరించాలని చీఫ్ వార్డెన్ నోటీసులు ఇచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు ఉద్యమించారు. తమ గళాన్ని బలంగా వినిపించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాం.. మేం ఎక్కడికి పోం అని చెప్పారు. ధర్నా కూడా చేశారు. ధర్నాకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దాదాపు 11 రోజుల తర్వాత కేసీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓయూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులను, విద్యార్థుల ఆందోళనలను ట్యాగ్ చేస్తూ ఓయూలో కూడా మంచినీటి కొరత, విద్యుత్ కొరత ఉందని చెప్పి హాస్టళ్లను మూసివేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రకంగా జరుగుతున్నప్పటికీ సీఎం, ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తేటతెల్లమైంది. ఈ రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం ఉంది. కనీసం మంచినీళ్లు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ మధ్యాహ్నం 3.46 గంటలకు ట్వీట్ చేస్తే.. వెంటనే చీఫ్ వార్డెన్‌కు రిజిస్ట్రార్ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది.
ఓయూలో నీటి, కరెంట్ కొరత లేదు.. హాస్టళ్లను, మెస్‌లను మూసివేస్తున్నట్లు ఎందుకు నోటీసులు ఇచ్చారో వివరణ ఇవ్వాలని చీఫ్ వార్డెన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఇంకా విచిత్రంగా ఎస్పీడీసీఎల్ నుంచి ఇంకో నోటీసు.. ఎంత అజ్ఞానులంటే.. వైస్ ఛాన్స్‌లర్‌కు బదులుగా వైస్ చైర్మన్ అని రాశారు. మీరు (వీసీ) మిస్ గైడ్ చేశారు.. వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ వారు అడిగారు. విద్యుత్ కొరత లేదని చెప్పారు. ఇక తెల్లారి సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కేసీఆర్‌ను చూస్తుంటే గోబెల్ పుట్టినట్టు ఉందన్నారు. 2023 మేలో కూడా ఇలాగే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో విద్యుత్, నీటి కొరత ప్రస్తావించినట్లు రేవంత్ రెడ్డి ఒక నోటీసు పెట్టి ఇరుక్కుపోయారు. సీఎం పెట్టిన నోటీసు కూడా ఫేక్ అని ఓయూ విద్యార్థుల నుంచి వందల మేసేజ్‌లు వచ్చాయి.
ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి.. తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుంచి సీఎం షేర్ చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. చివరకు స్టాంప్ కూడా మార్చి చిల్లర ప్రయత్నం చేసింరు. ముఖ్యమంత్రి చేసిన వెధవ పనికి మా నాయకుడు క్రిశాంక్‌ను అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇప్పుడు జైల్లో ఉండాల్సింది ఎవరు.. ఫోర్జరీ డాక్యమెంట్ చేసిన ముఖ్యమంత్రా..? అది ఫేక్ సర్క్యులర్ అని, దాంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ప్రజలకు తెలియజేసినా క్రిశాంక్‌నా..?
నేను చెప్పింది తప్పని సీఎం కానీ, ఓయూ అధికారులు కానీ రుజువు చేస్తే.. నేను చంచల్‌గూడ జైలుకు పోవడానికి రెడీ.. నేను చెప్పింది రైట్ అయితే సీఎంను చంచల్‌గూడ జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నా. ఫోర్జరీ చేయడం నేరం. కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆధారాలన్నీ జడ్జి ముందు పెడుతాం. ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా ఎక్స్‌పోజ్ చేసే వారిలో క్రిశాంక్ ముందుంటాడు కాబట్టి ఆయనను టార్గెట్ చేశారు. ఆయనను వెంటనే బేషరుతగా విడుదల చేయాలి. నకిలీ నోటీసులు తయారు చేసిన సీఎంపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి. క్రిశాంక్‌ను అరెస్టు చేయడం దుర్మార్గం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు’ అని కేటీఆర్ అన్నారు.