Kohli| రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయస్సులోను గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఐపీఎల్ సీజన్ 2024లో కోహ్లీ అద్భుతంగా ఆరెంజ్ క్యాప్ కూడా సంపాదించుకున్నాడు. అయితే పరుగులు రాబట్టడంపై దృష్టి పెట్టిన కోహ్లీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా మెయింటైన్ చేశాడు. గతంలో కనిపించిన దూకుడు ఐపీఎల్ సీజన్ ఆరంభంలో కనిపించలేదు. దాంతో కామెంటేటర్స్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఎప్పుడు విమర్శలు వచ్చిన తన బ్యాట్‌తోనే సమాధానం ఇస్తుంటాడు కింగ్ కోహ్లీ. తర్వాత దూకుడిగా ఆడిన కోహ్లీ సీజన్ మొత్తం స్ట్రైక్ రేట్ 154.70కు పెంచి విమర్శకులకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
అయితే విరాట్ కోహ్లీ ఎక్కడ ఔట్ అవుతానేమో అని భయంతో దూకుడుగా ఆడడం లేదని ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అన్నాడు. అయితే తర్వాత కోహ్లీ దూకుడుగా ఆడడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సైమన్ తెలియజేశాడు. సీజన్‌లో కోహ్లీనే బెస్ట్ అంటూ కితాబు కూడా ఇచ్చాడు. అయితే కోహ్లీని విమర్శించిన సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయని, కొందరు సోషల్ మీడియాలో చంపేస్తామంటూ బెదిరించారని క్రిక్ బజ్ కార్యక్రమంలో సైమన్ డౌల్ వెల్లడించాడు. కోహ్లీ గురించి గొప్పగా వెయ్యి మాట్లాడిన, ఒక్క విమర్శ చేసినందుకు తనకి విమర్శలు వచ్చాయని తెలియజేశాడు.
ఔట్ అవడం గురించి కోహ్లీ ఆలోచించకుండా దూకుడుగా ఆడాలనే తాను చెప్పానని , ఆయన గురించి నెగెటివ్‌గా నేను మాట్లాడడం చాలా అరుదు అని సైమన్ అన్నారు. కోహ్లీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, మ్యాచ్‌లు ముగిసాక మేము ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవంటూ కూడా సైమన్ తెలియజేశాడు. కాగా, ఈ సీజన్‍లో ఓ దశలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ స్ట్రైక్‍రేట్‍పై విమర్శలు చేయడం మనం చూశాం. అయితే, ఆ తర్వాత దూకుడు పెంచి ఆడిన కోహ్లీ స్ట్రైక్ రేట్‍ను పెంచుకున్నాడు. విమర్శలకు బ్యాటింగ్‍తో పర్‌ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు.