ఇప్పుడు దేశమంతా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వినూత్నంగా ప్రచారం చేస్తూ.. ఓటు హక్కు ప్రాధాన్యతను యువతకు తెలియజేస్తున్నారు.
అసోంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి కూడా మరోసారి వినూత్న ఆలోచన చేశారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్‌కు వచ్చేలా ప్రోత్సహించడానికి బడ్డీ ఓటర్ అనే కార్యక్రమాన్ని కీర్తి జల్లి ప్రారంభించారు. రెండోసారి ఓటు వేయబోతున్న వారు.. బడ్డీ ఓటర్ కార్యక్రమంలో భాగంగా తొలిసారి ఓటర్లను ప్రోత్సహించాలి.
ఎలాగంటే.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువత.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే వారి చేతికి బడ్డీ బ్యాండ్‌ను కట్టి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించాలి. సోమవారం నాగర్‌బెరా ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది తొలిసారి ఓటర్లు పాల్గొన్నారు.
బడ్డీ ఓటర్ సారాంశం ఏంటంటే.. సాధారణంగా తమ రక్షణకు హామీ ఇవ్వాలని కోరుతూ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతారు. అలాగే మేము మొదటిసారి ఓటు వేసే వారికి తోడుగా ఉంటామని, ఓటు వేయాలని సీనియర్లు కట్టేదే ఈ బడ్డీ బ్యాండ్. ఏడో తేదీన ఓటు వేయండి అని ఈ బడ్డీ బ్యాండ్లపై రాసి ఉంది. కామరూప్ జిల్లాలో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ కామ్‌రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పోస్ట్‌కార్డులు రాశారు. మే 7న వందశాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని కీర్తి జల్లి ‘మా ద్యూటాలోయ్, వోట్‌డానోర్ అహబాన్’ (ఓటు వేయమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి) ప్రచారం చేపట్టారు.
అసలు కీర్తి జల్లి ఎవరు..?
కీర్తి జల్లి స్వస్థలం వరంగల్ జిల్లా తరిగొప్పుల. ఆమె తండ్రి జల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లి అక్కడ కోచింగ్ తీసుకుంది. రెండేండ్లు కష్టపడ్డ తర్వాత 2013లో సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ శిక్షణ పూర్తయ్యాక అసోంలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ వివిధ బాధ్యతల్లో పని చేశారు. ప్రస్తుతం కామరూప్ జిల్లా కలెక్టర్‌గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.
2016లో బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డు సొంతం
జోరహట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడానికి భోని(చిన్న చెల్లెలు) అనే ప్రచారకర్త బొమ్మ(మస్కట్)ను తయారు చేసి అన్ని చోట్ల ఆ బొమ్మ ద్వారా ప్రజలను ఉత్సాహపరిచింది. అసోం సంస్కృతిలో చిన్న చెల్లెలు అంటే మురిపెం ఎక్కువ. ఆ మురిపెంను ఆమె అవకాశంగా మలుచుకుని మహిళా ఓటర్లను ప్రోత్సహించింది. ఈ వినూత్న ఆలోచన ఎలక్షన్ కమిషన్‌కు నచ్చడంతో బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డు అందజేశారు.