Thursday, April 3, 2025
HomeTelanganaIAS Officers | చిక్కుల్లో ఐఏఎస్ లు.. చుట్టుకుంటున్న గత పాపాల చిట్టా..

IAS Officers | చిక్కుల్లో ఐఏఎస్ లు.. చుట్టుకుంటున్న గత పాపాల చిట్టా..

Janapadham_EPaper_TS_31-10-2024

అయ్యో..?!

క్యాప్షన్ : కైలాసం టు పాతాళం..
చిక్కుల్లో ఐఏఎస్ లు..
చుట్టుకుంటున్న గత పాపాల చిట్టా..
భూ అక్రమాల్లో విచారణ ఎదుర్కొంటున్న అమయ్ కుమార్
ల్యాండ్ తారుమారు చేశారంటూ మరో ఇద్దరిపైనా..
నవీన్ మిట్టల్, సోమేశ్ పై ఈడీకి బాధితుల ఫిర్యాదు
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని మరీ ఆరోపణలు..
ఇప్పటికే జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్..
సివిల్ సర్వెంట్లకు చుట్టుకుంటున్న పాత చిట్టాలు…

ఎగిసెగిసి పడితే ఎల్లెల్కల పడడానికి కూడా సిద్ధమై ఉండాలి. కన్నూమన్ను కానకుండా ప్రవర్తిస్తే కండ్ల ముందు అగాధం కనిపిస్తున్నా కూరుకుపోవడానికి రెడీగా ఉండాల్సిందే. ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారు., ప్రసన్నం చేసుకుంటూ మెట్లెక్కచ్చు అని భ్రమపడితే అది కైలాసంలో నిచ్చెన మాదిరి షార్ట్ కట్ తప్ప మెయిన్ ఎంట్రన్స్ కానే కాదు. అంతటి వేగంగా సాగే ఆటలో ఒక్క పాము గనుకు ఎదురైతే అప్పుడు తెలుస్తుంది మనమెంత ఆటగాళ్లమో అని. ఎంత తక్కువ సమయంలో పైకెక్కామో.., అంతకు రెట్టింపు వేగంతో పాతాళానికి పడి పీకల్లోతుల్లో కూరుకుపోతాం. ఈ ఐఏఎస్ ల తీరు చూస్తుంటే కూడా అచ్చు అలాగే అనిపిస్తున్నది. గత సర్కార్ హయాంలో ఎదురే లేదన్నట్టుగా చలాయించుకున్న వీరు ఇప్పుడు ఎన్నో వలయాల్లో ఇరుక్కుని గిలగిలా కొట్టుకుంటున్నారు. వేలకోట్ల భూ కుంభకోణాల్లో చిక్కుకుని విచారణలకు హాజరవ్వాల్సిన దయనీయ స్థితిలో సివిల్ సర్వెంట్లు కాస్త ఛీవిల్ సర్వెంట్లుగా మారుతున్నారు.

===============

జనపదం, బ్యూరో

ఐఏఎస్.. ఆ పోస్టు అంటేనే దేశంలో అంతకు మించిన హోదా ఉండదు. యావత్తు సమాజానికి దిశానిర్దేశం., ప్రజా జీవన విధానాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే హుందాతనం., సర్కార్ కు జనాలకు మధ్య వారధిగా దేశ పోకడనే నడిపే కీలకమైన విధి నిర్వహణ. చట్టాలు రూపకల్పన చేసే సభలు ఒకవైపు.., అవి రూపొందించిన శాసనాల ఫలాలు అందుకునే జనాల మరోవైపు.. ఇలా భిన్నమైన కత్తి అంచుల వంటి ధ్రువాల మధ్య ఎంతో ఓర్పుగా, సహనంతో చాకచక్యంగా సాగాల్సిన గౌరవప్రదమైన పెద్దరికం. అంతటి కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటూ ముందుకెళ్లే పెద్దరికం ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పితే మొదటికే మోసం., నిండా మునిగాల్సిన ఘోరం. కీలకమైన స్థానంలో ఉన్న వారు దుర్వినియోగానికి పాల్పడితే ఆ తర్వాత అంతకుమించిన అధ:పాతాళానికి తొక్కేయబడడం ఖాయం.

=====================

ఆ ఐఏఎస్ లను తలుచుకుంటే అయ్యో.. అనాలనిపిస్తున్నది. సమయమెప్పుడు ఒకేలా ఉండదు., సందర్భం ఎప్పటికీ కలిసొస్తుందనే ఆశలూ పెట్టుకోవద్దు. ఎప్పటి అవసరం అప్పటిదే. మెచ్చుకుంటున్నారు కదా అని తప్పుడు పనులకు సైతం సై అంటే., ఆ తర్వాత తీర్చిదిద్దుకోలేని గందరగోళంలో ఇరుక్కోవాల్సిందే. తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల పని తీరు వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వారు తీసుకున్న నిర్ణయాలు వారి ఉద్యోగాలను ప్రమాదంలో పడేశాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ, భూదాన్‌ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా అమోయ్‌ సహా మరో ఐఏఎస్‌ నవీన్‌ మిట్టల్, మాజీ ఐఏఎస్‌ సోమేష్‌ కుమార్‌పై కొండాపూర్‌ వాసులు భూ అక్రమ వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. బుధవారం బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న కొండాపూర్‌ వాసులు నవీన్ మిట్టల్, సొమేశ్ కుమార్ అక్రమ భూబాగోతంపై ఫిర్యాదు చేశారు. మీజీద్‌ బండి లో ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్ కు ఓ కుటుంబం దానం చేసిందని ఫిర్యాదుదారులు ట్రస్ట్‌ భూమిపై కన్నేశారని వివరించారు. అదే భూమిలో నుంచి భూపతి అసోసియేట్స్‌ అనే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తూ అక్రమంగా జీవో నెం.45ను జారీ చేశారంటూ బాధితులు ఈడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్‌ లు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీలావుంటే బీఆర్ ఎస్ పాలనలో అంతా తానై అధికార యంత్రాంగాన్ని న‌డిపించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ‌రుస‌గా చిక్కుల్లో ప‌డుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై కొండాపూర్ లో ఓ భూ వివాదం వ్యవ‌హారంలో నేరుగా ఈడీకి ఫిర్యాదు అందడం కలకలం రేపుతున్నది.

అస‌లేం చేశారు..?
బీఆర్ ఎస్ ప్రభుత్వంలో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణితో భూ అక్రమాలు జ‌రిగాయ‌ని కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచార‌ణ సాగిస్తున్నది. ధ‌ర‌ణిని మార్చి కొత్తగా ఆర్ ఓ ఆర్ యాక్ట్ ను తీసుకువ‌స్తున్నది. ఈ నేప‌థ్యంలోనే ప‌లు భూ అక్రమాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్రమాలు ఎక్కువ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో అప్పుడు క‌లెక్టర్ గా వ్యవ‌హ‌రించిన అమోయ్ కుమార్‌ను విచార‌ణ చేస్తున్నారు. ఏకంగా ఈడీ వ‌ద్దకు ఈ వివాదం చేరింది. అయితే, క‌లెక్టర్ గా వ్యవ‌హ‌రించిన అమోయ్‌తో పాటుగా సీసీఎల్ఏ బాధ్యత‌లు నిర్వర్తించిన న‌వీన్ మిట్టల్‌, సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ కు కూడా ఈ అక్రమాల్లో భాగం ఉన్నట్లు విమ‌ర్శలున్నాయి.

గ‌తంలోనే సోమేశ్ పై ఈడీ..
రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఐజీఎస్టీ కుంభకోణంలోకి ఈడీ రంగ ప్రవేశం చేసింది. గతంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ స్థాయిలో నగదు అక్రమ చెలమణి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. అయితే తాజాగా ఈడీ సైతం ఈ కేసులో రంగంలోకి దిగింది. వారందరిపై కేసులు సైతం నమోదు చేసి షాక్ ఇచ్చింది. ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్, ఏ5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కేసు బుక్ చేశారు.

ఖజానాకు భారీగా గండి..
ఐజీఎస్టీకి సంబంధించి దాదాపుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేశారు. ఫలితంగా సర్కారు ఖజానాకు గండి పడ్డట్లు సీసీఎస్‌ పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చారు. బోగస్‌ ఇన్వాయిస్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేశారని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ గతేడాది చేపట్టిన ఆడిట్‌లో భాగంగా గుర్తించింది. వస్తువుల పంపిణీ చేయకపోయినా, తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించినట్లు గుర్తించారు. రూ.వేల కోట్లలో స్కామ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం, పూర్తిస్థాయి దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగించింది.

ఇ – రేస్ లో అరవింద్ కుమార్…
ఇ – రేస్ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అభియోగాలు నమోదయ్యాయి. కేటీఆర్ నోటి మాటగా చెప్పడంతో హెచ్ఎండీఏ నిధులను అప్పనంగా అందజేసినట్టు అభియోగాలు నమోదు కావడంతో ఈ సీనియర్ ఐఏఎస్ కూడా కస్టాల్లో కురుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సర్కార్ నుంచి ప్రత్యేక ఆదేశాలు లేదంటే జీవో విడుదల వంటివి ఏమీ లేకుండానే నిధులను దారి మళ్లించినట్టు ఇప్పటికే బహిర్గతమయ్యింది. దీంతో ఇ – రేస్ ఇష్యూ ఈయన మెడకు చుట్టుకునే ప్రమాదాలు పొంచిఉన్నాయి.

సోమేష్ కుమార్ పైనే అనుమానం..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ చక్రం తిప్పారు. ఆయన కనుసన్నల్లోనే తాము సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసేందుకు అంగీకరించామని కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ అంగీకరించినట్లు సీసీఎస్‌ పోలీసులు అప్పట్లోనే బహిర్గతం చేశారు. స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌ పేరిట సోమేష్ కుమార్ ఏకంగా ఓ వాట్సాప్‌ గ్రూపు సైతం ఏర్పాటు చేశారు. దీని ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేవారని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సోమేష్ సహకారంతోనే 75 సంస్థలకు సంబంధించి ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్ వేర్ ను మార్చారని, ఫలితంగా ఐటీసీ క్లెయిమ్‌లకు వీలు కల్పించారన్నారు. ఈ క్రమంలోనే సుమారుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీ సొమ్మును క్లెయిమ్‌ చేసుకున్నట్లు గుర్తించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు