షుగర్ అనే వ్యాధి.. వయసుతో తేడా లేకుండా వచ్చేస్తోంది. మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం మధుమేహానికి ప్రధాన కారణం. బరువు పెరగడం కూడా డయాబెటిక్‌కు దారి తీయొచ్చు. మధుమేహం రావడానికి ఇవే ప్రధాన సమస్యలు అని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ నిత్యం మనం తినే ఉప్పుతో కూడా డయాబెటిక్ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన లుకీ ఆయన బృందం దీన్ని అధ్యయనం చేసింది.
దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత ఉప్పుతో డయాబెటిక్ ముప్పు ఉందని పరిశోధనలో తేలింది. కాబట్టి డయాబెటిక్ బారిన పడొద్దు అనుకునే వారు వీలైనంత వరకు ఉప్పు తక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో అదనంగా ఉప్పు అసలే వేసుకోని లేదా ఎప్పుడో ఒకసారి వేసుకునే వారితో పోలిస్తే తినే ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారికి మధుమేహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది.
ఆహారంలో అదనంగా ఉప్పు అసలే కలపని లేదా అరుదుగా కలిపి తినేవారికి డయాబెటిక్ ముప్పు 13 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కొన్నిసార్లు మాత్రమే ఉప్పు వేసుకునే వారికి 20 శాతం, తరచూ వేసుకునేవారికి 39 శాతం ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది. జీవన శైలి, ఆర్థిక పరిస్థితులు, ఇతర వ్యాపకాలతో సంబంధం లేకుండా ఉప్పుతో ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. దీనికి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియనప్పటికీ, అదనంగా ఉప్పు కలపడం వల్లే అని పరిశోధకులు భావిస్తున్నారు.