Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరమంతా కాస్త చల్లబడింది. నిన్న సాయంత్రం దంచికొట్టిన వానకు నగర ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న హైదరాబాద్ నగరంతో పాటు ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మహబూబ్‌నగర్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నగరంలోని ఖైరతాబాద్‌లో 36.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.