హైదరాబాద్: భారీ వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. భాణుడి ప్రతాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలో మరో ఐదురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు (Rain) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అదేవిధంగా ఎన్నికలు జరుగనున్న మే 13న మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
గురువారం దాదాపు ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకునే ఉన్నాయి. ఇక వచ్చే 24 గంటలు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ నెల 10న నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
11న వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో.. 12న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 13న వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 9, 2024