హైదరాబాద్: భానుడి భగభగలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాగల ఆరు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మంగళవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నదని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం బలహీనపడిందని వెల్లడించింది.