Impact Player| ఐపీఎల్ ప్రతి ఏడాది క్రికెట్ ప్రేమికులకి ఎంత మజా అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లని ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు బీసీసీఐ కూడా కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఆ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని తీసుకొచ్చింది. దీని వలన ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా తీసుకొని బౌలింగ్, బ్యాటింగ్‌లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. గత సీజన్ నుండి ఈ రూల్ నడుస్తుంది. అయితే దీని వలన కొన్ని సార్లు చాలా టీమ్స్ లాభపడ్డాయి. అయితే ఇది క్రికెట్ స్పూర్తిని కూడా దెబ్బ తీసే విధంగా ఉందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రూల్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ సహా పలువురు ప్లేయర్లు, మాజీలు తీవ్ర అసంతృప్తి కనబరచడం మనం చూశాం.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్ రౌండర్స్‌కి గుర్తింపు లభించడం లేదు. కొత్తవారికి అవకాశాలు రావడం లేదు. ఈ రూల్ వలన బౌలర్స్‌కి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నానే విమర్శలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ వలన బ్యాటర్స్ ఎక్కువ కావడంతో 200 పరుగుల స్కోర్ చేసిన గెలుస్తామనే నమ్మకం కూడా లేకుండా పోయింది. శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు ఈ రూల్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. వారికి బౌలింగ్ వేసే అవకాశం కూడా రావడం లేదు. రింకూ సింగ్ లాంటి ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోవడంతో ప్రతిభ సెలక్టర్స్‌కి కనిపించలేదు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా తొలిసారి స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ రూల్‌ను కొనసాగించాలా? వద్దా? అనే దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అని ఆయన తెలియజేశారు. కేవలం టెస్టింగ్ కోసం ఈ రూల్ పెట్టాం. దీని వలన ఇద్దరు భారతీయ క్రికెటర్స్‌కి ఆడే అవకాశం ఉంటుందని ఆ రూల్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ రూల్‌పై ఎలాంటి స్పందన వస్తుంది, దాని వలన ఏమైన నష్టం ఉందా అని త్వరలోనే చర్చిస్తాం. ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలు.. బ్రాడ్ కాస్టర్లతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తాం. ఇదేమీ శాశ్వతం కాదు. ఈ నిబంధనపై ఎవరి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ రాలేదు అంటూ జైషా తెలియజేశారు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత బీసీసీఐ దీని గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.