ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం జూన్ 1న
గెలుస్తామన్న ధీమాతో ప్రతిపక్షాలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కోసం ముందుగా ఏర్పాటు
చివరి దశ పోలింగ్ వల్ల సమావేశానికి రాలేక పోతున్న మమత
(జనపదం ఢిల్లీ ప్రతినిధి)
ఉత్తర భారత రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తున్నదనే సూచనలు కనిపిస్తుండటంతో ఇండియా కూటమిసభ్యులలో ధీమా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో జూన ఒకటవ తేదీన ఇండియా కూటమి సభ్య రాజకీయ పక్షాలు సమావేశం కావాలని నాయకులు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు మిత్ర పక్షాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.
జూన్ నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే తక్షణ కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో భాగస్వామ్య పక్షాల నాయకులు ఎన్నికల తీరును సమీక్షిస్తారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తారు. బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు కలిపి మెజారిటీ లభించక పోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉత్తరాదిన మోదీకి ఎదురుగాలి ఉన్నదని, అక్కడ ఏర్పడిన లోటును దక్షిణాదిన లభించే కొద్దిపాటి సీట్లు భర్తీ చేయలేవని కాంగ్రెస్, మిత్రపక్షాల నాయకులు భావిస్తున్నారు. బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు సాధించలేక పోతే, తటస్థంగా ఉండే పక్షాలు కూడా సహకరించక పోవచ్చు. దీంతో ఇండియా కూటమి వేగంగా పావులు కదుపవలసి ఉంటుంది. తమ కూటమి లోని మిత్ర పక్షాలను బీజేపీ ఒత్తిడి నుంచి కాపాడుకోవలసి ఉంటుంది. తమకు మెజారిటీలభించక పోతే తటస్థ పార్టీలతో చర్చలు జరపవలసి ఉంటుంది. మోదీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పక్షాలను బలహీనపరచడానికి అనేక ఒత్తిడులు తెచ్చారు కనుక, ప్రాంతీయపక్షాలు తప్పనిసరిగా తమ పాలనను కోరుకుంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. పలు చిన్న పార్టీల నాయకులు కూడా హంగ్ ఏర్పడాలనే ధోరణిలో ఉన్నారు.
జూన్ 2 లేదా 3 వ తేదీన ఇండియా కూటమి సమావేశం జరపాలని అనుకున్నారు. కానీ ఎన్నికల ప్రచారం కోసం కోర్టు నుంచి తాత్కాలికంగా వెసులు బాటు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మళ్ళీ కోర్టును చేరుకొని నిర్బంధానికి సహకరించవలసి ఉంటుంది. అందువల్ల ఒకటవ తేదీన జరపాలని నిర్ణయించారు. అయితే చివరి దశ పోలింగ్ జూన్ ఒకటవ తేదీన ఉన్నది. అందువల్ల తాను హాజరు కాలేనని తృణమూల్ కాంగ్రెస్ నేత మమత బెనర్జీ తెలిపారు. అయితే ఇండియా కూటమితో మమత ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలుస్తున్నది.
ఇండియా కూటమి 2023 మార్చిలో ఏర్పాటయింది. ఆనాడు ప్రతిపక్ష శిబిరంలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత నితీశ్ తన సహజ శైలిలో మరో పిల్లి మొగ్గ వేసి బీజేపీ కౌగిటిలో ఒదిగిపోయాడు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొంత మేర బలం కలిగి ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ కూడా బీజేపీ కూటమిలోకి పోయింది. ఆ తరువాత కాలంలో ఇండియా కూటమి ప్రజలలో వేగంగా చొచ్చుకుపోయింది. పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో నేర్పును ప్రదర్శించింది. ప్రత్యేకించి సోనియా, ప్రియాంక కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం ఉంది.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉన్నది. రెండు కలిసి పోటీ చేసి మరో పార్టీకి ప్రత్యర్థి పార్టీకి ఉండే స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఇవ్వడం కన్నా విడిగా పోటీ చేయడం మేలని భావించాయి. కేరళలో కూడా వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటమి విడిగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ కూడా పోటీ ఈ రెండు కూటముల మధ్యే ఉన్నది. పశ్చిమ బెంగాల్ లో కూడా తృణమూల్ కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తున్నాయి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్ణయాలు , పోకడ మూలంగా 2019 లోక్‌సభ ఎన్నికలలో, వివిధ అసెంబ్లీ ఎన్నికలలో వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయం ఉన్నది. ఈ నేపథ్యంలో సోనియా స్వయంగా రంగంలోకి దిగి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దారు. దీంతో పాటు ఎన్నికల సందర్భంగా మిత్రపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో విజయవంతం అయ్యారు. ప్రియాంక గాంధీ కూడా మిత్ర పక్షాలతో పొత్తులను కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఎన్నికల టాస్క్ ఫోర్స్ బృందంలో ఉండి, ఆయా రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం చేకూర్చారు. ఈ లోక్‌సభ ఎన్నికలలో కూడా పార్టీనే కాకుండా, ఇండియా కూడా కూటమిని సోనియాతో పాటు చురుగ్గా నడిపించారు.
ప్రత్యేకించి ఉత్తర ప్రదేశ్‌లో, బిహార్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో సమన్వయంతో వ్యవహరిస్తూ , బీజేపీని ఢీకొన్నారు. దీంతో బీజేపీకి ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకున్నామనే అభిప్రాయం ప్రతిపక్ష శిబిరంలో ఏర్పడింది. కార్యకర్తలలో కూడా ఉత్సాహం నెలకొంది.
బిహార్‌లో తేజస్వి యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడంతో బలమైన కూటమి ఆవిర్భవించింది. వామ పక్షాలు కూడా ఇందులో ఉన్నాయి. తేజస్వీ యాదవ్‌కు యువతలో మంచి పేరు ఉన్నది. బహిరంగ సభలకు జనం భారీగా రావడం కనిపించింది. నితీశ్ కుమార్ ప్రతిష్ఠ దిగజారడం, బీజేపీ పట్ల వ్యతిరేకత ఇండియా కూటమికి అనుకూలంగా మారిందనే అభిప్రాయం కాంగ్రెస్ నాయకులలో ఉన్నది.
ఉత్తర ప్రదేశ్‌లో 80 స్థానాలు, బిహార్‌లో 40 స్థానాలు ఉన్నందున ఈ రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి బలంగా మారడం, బీజేపీకి దెబ్బ అని భావిస్తున్నారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా బీజేపి పరిస్థితి ఆశాజనకంగా లేదనే వార్తలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఘోరంగా దెబ్బతింటుందనే అభిప్రాయం పరిశీలకులలో ఉన్నది. కర్ణాటకలో కూడా బీజేపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుందనే అభిప్రాయం ఉన్నది. మొదటి ఆరు దశల పోలింగ్‌లోనే ఇండియా కూటమి సీట్ల సంఖ్య 272 దాటి పోయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొదటి ఆరు దశలలో 486 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ పాటికే ఇండియా కూటమి భారీ మెజారిటీని సాధించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేశ్ ప్రకటించారు. అందువల్ల జూన్ ఒకటిన ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులను జూన్ 1 భేటీకి ఆహ్వానించినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.