Saturday, December 28, 2024
HomeTelanganaIndiramma housing scheme | ‘కొంప’ ముంచుతున్నది..?

Indiramma housing scheme | ‘కొంప’ ముంచుతున్నది..?

‘ఇందిరమ్మా..’ ఇదేందమ్మా..

JanaPadham_Epaper _TS_24-10-2024

‘కొంప’ ముంచుతున్నది..?
‘ఇందిరమ్మా..’ ఇదేందమ్మా..

ప్రజా పాలనలో ‘ఇల్లు’ చిచ్చు..
ఊరూరా ఇందిరమ్మ కమిటీల ఖయ్యం..
పాత, కొత్త కాంగ్రెస్ డిష్యుం డిష్యుం..
స్టేషన్ ఘన్ పూర్ లో ఇందిరా వర్సెస్ కడియం
మానుకోట లో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ
భద్రాద్రిలో పొదెం తో తేల్చుకునే పనిలో తెల్లం
ప్రతి సెగ్మెంట్లోనూ సిగపట్లు…

‘ఇల్లు’ చిచ్చు పెడుతున్నది. పేదోడికి దక్కాల్సిన కొంప పెద్దోళ్ల పట్టింపులకు కూలిపోతున్నది. నియోజకవర్గాల్లో ఇందిరమ్మ కమిటీల మధ్య ఖయ్యం పార్టీకి తలనొప్పిగా మారగా., లబ్ధిదారులకు ఆశానిపాతంగా తయారైంది. అంతా కూర్చుని తేల్చాల్సిన లెక్కల్లో ఒకరికొకరికి పొసగని తీరు అసలుకే మోసంగా మారింది. తన వారికంటే తనవారికి., నా కోటాకు దక్కాలంటే., లేదు నేను చెప్పిన కోటాకు చెందాల్సిందే అని పట్టింపు ధోరణి పార్టీలోని లుకలుకలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నది. ఏ నియోజకవర్గం చూసినా పాత, కొత్త కాంగ్రెస్ మధ్య విభజన రేఖ క్లారిటీగా కనిపిస్తున్నది. పేదవాడికి గూడేమోగానీ ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు, ఎంపీలు మొదలు ఎమ్మెల్సీల వరకు ఎవరికి వారుగా ఐక్యత లేని సమావేశాల్లో తేల్చేది ఏమీ లేదనే అభిప్రాయాన్ని చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కలల ప్రాజెక్టు, పేరు చెబితేనే గుర్తొచ్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్కార్ తీరును ప్రశ్నార్థం చేసే దుస్థితి దాపురించింది.

======================

జనపదం, బ్యూరో

కాంగ్రెస్ పార్టీని ‘కొంపే’ ముంచేలా ఉంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య ఏర్పడుతున్న అగాధాలు ఉనికికే ప్రమాదాన్ని తెచ్చేలా అనిపిస్తున్నది. నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు ఇస్తామని, అదీ ఈ నెలాఖరులోగా ప్రక్రియ మొదలు పెడుతామని మంత్రి పొంగులేటి చెప్పిన మాటలతో లబ్ధిదారులు సంతోషంలో మునిగిపోగా, క్షేత్రస్థాయిలో ఎంపిక చేయాల్సిన ఇందిరమ్మ కమిటీల ఖయ్యం వారి ఆశలను ఆవిరి చేస్తున్నది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిసి ఓ జాబితాగా ఇవ్వాల్సిన ప్రక్రియలో ఎవరి పట్టింపులకు వారు బెట్టు చేస్తుండడంతో మొదటికే మోసం వచ్చేలా తయారైంది.

ప్రజా పాలనలో ‘ఇల్లు’ చిచ్చు..
ఊరూరా బీదవాడికి సొంతగూడు కల్పించడమే తమ పార్టీ అభిమతమని ప్రకటించిన సీఎం అండ్ కో మాటలు ఎంత అట్టహాసంగా అనిపించాయో అదే స్థాయిలో పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా మారాయి. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులు, కేవలం బీదవారికి మాత్రమే ఫలాలు దక్కేలా చర్యలు తీసుకుంటామని, తన, పర పక్షపాతం ఉండదని, అందునా ఇతర పార్టీల వారా., స్వపక్షపు లబ్ధిదారులా.. అనే వ్యత్యాసాలు కూడా చూడమని ప్రకటించుకున్న పార్టీ పెద్దల మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను తయారు చేయాల్సిన కమిటీ సభ్యుల మధ్య ఇగో ఫీలింగ్స్, తనవారు, పరాయికి చెందిన వారు అనే స్పష్టమైన విభజనతో ఎటూ తేలడం లేదు. సామాన్యుడి ప్రయోజనమే లక్ష్యంగా సాగుతుందని చెప్పుకుంటున్న ప్రజాపాలన లో ఇందిరమ్మ ఇల్లు చిచ్చు ఎంతో క్లియర్ గా కనిపిస్తున్నది.

పాత, కొత్త కాంగ్రెస్ డిష్యుం డిష్యుం..
కాంగ్రెస్ పార్టీలోకి వలసొచ్చిన వారు., దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని, పార్టీకోసమే పనిచేస్తున్న వారు అనే తేడా ఇప్పుడు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్నకాక మొన్నొచ్చిన వారు ఎప్పటి నుంచో పార్టీ కోసమే అన్నీ అర్పించుకుంటున్న తమపై అజామాయిషీ చేయడం ఏమిటీ అనే సీనియర్, జూనియర్ వ్యత్యాసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో క్లియర్ గా తెలిసిపోతున్నది. మొన్నటి జనరల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వయంగా తమపై పోటీకి దిగిన వారు, తమనుఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడంతో తేరగా వచ్చి పార్టీలో చేరిన వారు ఇఫ్పుడు మళ్లీ తమపైనే ఆజమాయిషీ చెలాయించడంపై సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు.
సరే పార్టీ పెద్దల ఆదేశాలు సీరియస్ గా ఉన్నాయని కలిసిపోవాలనే ఉద్దేశ్యంతో సాగుతున్నా, ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వారి మధ్య మనస్పర్థాలను మరోమారు బహిర్గతం అయ్యేలా చేస్తున్నది. జాబితా తయారీలో ఎవరికి నచ్చిన వారిని వారు, ఎవరి అనుయాయులకు వారు., ప్రాధాన్యం ఇవ్వాలని పడుతున్న పోటీతో అసలు పార్టీ ఐక్యతే ప్రశ్నార్థకం అయ్యింది. నియోజకవర్గానికి నాలుగువేల ఇండ్లు వస్తాయని మంత్రి ప్రకటించిన నుంచి ఎవరికి వారుగా తమతమ అనుయాయులకు దక్కాలనే తాపత్రయంలో పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో లొల్లి ముదిరి పాకాన పడింది. ఏ నియోజకవర్గాన్ని చూసినా గెలిచిన వ్యక్తి, ఓడిన నేత మధ్య అంతర్యుద్ధం కళ్లకు కట్టినట్టుగా తెలిసిపోతున్నది.

పచ్చగడ్డి వేస్తే భగ్గు..
మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల చిచ్చు తారాస్థాయికి చేరింది. మొన్నటి వరకు పార్టీతో సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు సడెన్ గా వచ్చి పెత్తనం చెలాయిస్తున్న తీరుకు నొచ్చుకుంటున్న పాత నేతలు బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్పూర్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇందిరా మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం తన అనుచరులకే ఇండ్లు దక్కేలా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇందిరా ఆరోపిస్తుండగా, పార్టీ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత విమర్శలకు సమయం కాదని కడియం పేర్కొంటున్నారు. ఇద్దరు ఎవరికి వారుగా విమర్శ, ప్రతివిమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటూ ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై పైచేయి సాధించాలని ప్రయత్నాలు చేస్తుండడంతో నియోజకవర్గంలో పరిస్థితి అంత తేలిగ్గా కొలిక్కి వచ్చే అవకాశాలే లేవనట్టుగా తోస్తోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
అలాగే మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యలు, ఎంపీతో ఖయ్యానికి కాలు దువ్వుతున్నట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఎంపీ పెత్తనం ఏంటని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో స్థాయికి మించి కల్పించుకుని తమకు ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఎంపీ తీరును దుయ్యబడుతున్నారు. ఎంపీ బలరాం నాయక్ తో నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన వారిమి, తమకు ముఖం చెల్లుబాటు కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వెళ్లే మళ్లీ ఎలా తిరిగేదని ఎమ్మెల్యేలంతా ఎంపీపై గరమవుతున్నారు.
ఇక భద్రాద్రిలో ఎమ్మెల్యే తెల్లం వర్సెస్ మాజీ పొదెం మధ్య అంతరం ఇందిరమ్మ ఇల్లు ఇంకా పెంచుతున్నది. తనకు చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ నిజమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియే నిలిచిపోయేంత పట్టింపులతో మొదులుతున్నారని స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. ఇలా ఏ సెగ్మెంట్లో చూసిన సిగపట్లతో అసలు ప్రయోజనాలను అటకెక్కించి పర్సనల్ పట్టింపులతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఎంతో ప్రయోజనం కలిగించాల్సిన పథకాన్ని అబాసుపాలు చేసే తీరుగా వ్యవహరిస్తున్న తీరు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..?

RELATED ARTICLES

తాజా వార్తలు