హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. భారతీయ కంపెనీలకు నేపాల్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు చెల్లింపులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ దేశానికి చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయని, వాటిని చెల్లించకపోవడంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ISPAN) వెల్లడించింది.
దేశంలోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపివేసినట్లు తెలిపింది. ఇంటర్నెట్ అంతరాయం ఇలాగే కనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలోన లేదని పేర్కొంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలకు అధిక ప్రాధాన్యం ఉన్నదని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, 18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు 5 గంటలపాటు సర్వీసులను తగ్గించాయని, అందులో కొన్ని బ్యాండ్ విడ్త్‌ను పూర్తి తగ్గించినట్లు ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డాటా ప్రకారం తెలుస్తున్నది.
కాగా, భారతీయ కంపెనీలకు స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లు రూ.187 కోట్లు (సుమారు 3 బిలియన్ నేపాలీ రూపాయలు) బాకీపడ్డారు. అయితే బయటి దేశాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయని, డబ్బులు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు అంటున్నాయని బ్రాడ్‌బాండ్ ప్రొవైడర్లు అంటున్నారు. నెపాలీ టెలీకమ్యూనికేషన్స్ అథారిటీ గణాంకాల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు దేశంలో 10 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. సర్వీసులను నిలిపివేసిన కంపెనీల్లో ఎయిర్‌టెల్ కూడా ఉన్నది.