IPL-2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు చెన్నై వేదికగా మ్యాచ్ జరుగనున్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. కోల్‌కతా జట్టు విజయవంతంగా ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఆ జట్టు ఓనర్, బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జట్టు యజమానిగా అత్యంత ఎక్కువ బాధకు గురిచేసిన సందర్భాన్ని ఆయన బయటపెట్టాడు. ఐపీఎల్ ఆరంభ రోజుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దుస్తులపై సందేహాలు లేవనెత్తడం తనకు చాలాబాధ కలిగించిందని షారుఖ్ ఖాన్ పేర్కొన్నారు.
తనకు ఇప్పటికీ గుర్తుందని.. ఒకాయన తన దగ్గరికి వచ్చి ప్లేయింగ్ కిట్ మాత్రమే బాగుందని.. ఆట బాగాలేదని అన్నారన్నారు. ఓ క్రికెట్ విశ్లేషకుడు తన మాట్లాడడం బాగా గుర్తందని.. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉండేదన్నారు. అయితే, గౌతమ్ గంభీర్‌ని తీసుకొచ్చాక పరిస్థితి మారిపోయిందని.. ఓడిపోకుండా ఉండడం నేర్చుకున్నామన్నారు. ఐపీఎల్ పలు సీజన్‌లో కోల్‌కతా పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచిన సందర్భాలు ఉన్నప్పటికీ జట్టు దుస్తులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం తనకు ఎక్కువ బాధ కలిగించిందని ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 జట్లలో ఒకటని ఈ సందర్భంగా అభివర్ణించాడు.