IPL 2024| ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా సాగాయి. మొదట చెన్నై, పంజాబ్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసిన చెన్నై 28 పరుగుల తేడాతో తెలిచింది. ఈ క్రమంలో చెన్నైపై వరుస ఐదు విజయాల పరంపరకి బ్రేక్ వేసింది. ఇక పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుండి మూడో స్థానానికి చేరింది. మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3×4, 2×6) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4×4, 1×6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2×4, 1×6) కీలక పరుగులు రాబట్టారు, కాని వాటిని పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయారు. ఇక శివమ్ దూబె, ధోని ఇద్దరు గోల్డెన్ డక్ అయ్యారు.
లక్ష్య చేధన తక్కువే ఉన్నా కూడా పంజాబ్ కింగ్స్ పరుగులు రాబట్టలేక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఏదశలోను వారు పోరాట పటిమ ప్రదర్శించలేదు. జానీ బెయిర్‌స్టో (7; 6 బంతుల్లో), రొసో (డకౌట్, 3 బంతుల్లో)ను తుషార్ దేశ్‌పాండే పెవీలియన్‌కి పంపి పంజాబ్‌కి పెద్ద దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ (27; 20 బంతుల్లో, 4×4)తో కలిసి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30; 23 బంతుల్లో, 2×4, 2×6) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన సీఎస్కే బౌలర్స్ విరుచుకుపడడంతో పంజాబ్ 78 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హర్‌ప్రీత్ బ్రార్ (17; 13 బంతుల్లో, 2×4), రబాడ (11; 10 బంతుల్లో) అజేయంగా నిలిచి పంజాబ్‌ను ఆలౌట్ కాకుండా చేశారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్‌పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక కోల్‌కతా, లక్నో మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), రఘు వంశీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) విలువైన పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్(3/49) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. ఇక లక్ష్య చేధనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్స్ స్టోయినిస్ 36 పరుగులు, కెప్టెన్ కేఎల్ రాహుల్ 25 పరుగులు చేశాడు. అష్టన్ టర్నర్ 16, ఆయుష్ బడోని 15, నికోలస్ పూరన్ 10 పరుగులు చేశారు. ఈ విజయంతో కేకేఆర్ 16 పాయింట్లు దక్కించుకోగా, దాదాపు ఆ టీం ప్లే ఆఫ్‌కి చేరినట్టే అని చెప్పాలి