Thursday, April 3, 2025
HomeTelanganaDMHO | సంసారం జీవితం ఎలా సాగుతుంది.. మహిళా మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు డీఎంహెచ్‌వో వేధింపులు.. అరెస్ట్‌

DMHO | సంసారం జీవితం ఎలా సాగుతుంది.. మహిళా మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు డీఎంహెచ్‌వో వేధింపులు.. అరెస్ట్‌

కామారెడ్డి: అత‌ను జిల్లా వైద్యాధికారి (DMHO).. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతోపాటు సిబ్బందికి బాగోగులు చేసుకోవ‌డం ఆయ‌న విధి. అయితే అంతా త‌న‌చేతిలోనే ఉన్నార‌నే భావ‌న‌తో ఉద్యోగుల‌ను వేధించ‌సాగారు. మ‌హిళా సిబ్బందిని త‌న ప‌క్క‌న కూర్చోమ‌న‌డం, ఫోన్ చేసి వారి వ్య‌క్తిగత జీవితాల‌కు సంబంధించిన విష‌యాలు అడ‌గ‌డం వంటివి చేస్తున్నారు. విసికిపోయిన సిబ్బంది అత‌నిపై ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదుచేయ‌డంతో ప్ర‌స్తుతం క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నారు.

కామారెడ్డి (Kamareddy) డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ తనిఖీల పేరుతో వస్తూ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా మెడికల్‌ ఆఫీసర్లు 10 రోజుల కింద వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. పీహెచ్‌సీకి వచ్చినప్పుడు త‌న పక్కన కూర్చోవాల‌ని డీఎంహెచ్‌వో అనేవార‌ని, కూర్చోకపోతే పనిలో లోపాలు వెతికి వేధించేవార‌ని, ఫోన్‌ చేసి మరీ సంసారం జీవితం ఎలా సాగుతుందంటూ అభ్యంతరకరంగా మాట్లాడేవారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడీహెచ్‌ (అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌) అమర్‌సింగ్‌ నాయక్‌ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇరు వర్గాలను పిలిపించి.. వారితో మాట్లాడారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకోగా.. వేధింపుల విషయాన్ని పలువురు మహిళా ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే తప్పుబట్టారు. బాధిత మహిళా ఉద్యోగులతో పాటు మరికొందరు అధికారులూ ఇక్కడికి రావాలన్నారు. డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన ఏడీహెచ్‌ అమర్‌సింగ్‌.. డీఎంహెచ్‌వోతో పాటు ఇతర ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని రికార్డు చేశానని, విచారణ నివేదికలో వాటిని పొందుపర్చి.. ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ నేప‌థ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ సింగ్‌, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్‌ ఆఫీసర్లు కూడా ఫిర్యాదు చేయ‌డంతో వారిద్ద‌రిపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు