ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్, క్యాషియర్
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించిన కాం ట్రాక్టర్‌కు చెల్లించాల్సిన డబ్బుకు బదులు ఎరువుల లోడ్‌లు ఇస్తూ ఒక్కో లోడుకు రూ.లక్ష చొప్పున లంచం డిమాండ్ చేస్తున్న కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్‌రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు అనే కాంట్రాక్టర్ మౌలిక వసతులు కల్పించారు. ఇందుకు సంబంధించి 2018-23 వరకు రాజుకు రూ.90,16,652 కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ కమీషన్ ఇవ్వాలంటే తనకు లంచం ఇవ్వాలని డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావు రాజును వేధిస్తున్నారు.