Kavita | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కవితను ఐదురోజుల కస్టడీకి కోరగా.. మూడురోజులు కస్టడీకి ఇచ్చింది. శనివారం నుంచి సోమవారం వరకు కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నది. మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పలు కీలక అంశాలను పేర్కొంది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.
జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని చెప్పింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ క్రమంలో సీబీఐ వాదనలు విన్న కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.