Friday, April 4, 2025
HomeTelanganaKCR: అధికారం ఉన్నా... లేకున్నా ప్రజల కోసమే: కేసీఆర్‌

KCR: అధికారం ఉన్నా… లేకున్నా ప్రజల కోసమే: కేసీఆర్‌

ఆనవాళ్లను చెరిపేయడమంటే.. నేను తెచ్చిన తెలంగాణనూ చెరిపేస్తరా? : కేసీఆర్‌
రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని, అలా కాకుండా కొందరు కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని, కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దానిని కూడా చెరిపేస్తరా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు.
  • కాంగ్రెస్‌ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత
  • రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య బాధ కలిగిస్తున్నది
  • అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకోసం నిలబడాలె
  • రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి చేరే అవకాశం
  • ఈసారి అధికారంలోకి వస్తే 15 ఏండ్లు పాటు బీఆర్‌ఎస్సే
  • త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణం: కేసీఆర్‌

హైదరాబాద్‌: రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని, అలా కాకుండా కొందరు కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని, కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దానిని కూడా చెరిపేస్తరా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏండ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి పిచ్చిపిచ్చి పనులు చేసి ప్రజలతో ఛీ అనిపించుకునే లక్షణం కాంగ్రెస్‌ సొంతమని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్‌ పాలన తర్వాత అలాగే జరిగిందని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూబీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ర్టాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని తెలిపారు.


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు చెలరేగడం బాధ కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారని, మరి శాంతిభద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని అభివృద్ధిని పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందని పేరొన్నారు.
పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలో వైఎస్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి. మతకల్లోలాలు చెలరేగాయి. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. మరి సమస్య ఎక్కడ వస్తున్నది.
-కేసీఆర్‌

రెండేండ్లలో నియోజకవర్గాల పునర్విభజన
తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకడు పుట్టకొకడు అయ్యిండనే బాధతో వ్యవసాయాన్ని స్థిరీకరణ చెయ్యాలని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులందరికీ అందించామని కేసీఆర్‌ వివరించారు. రకరకాల కారణాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడా పథకానికి ఎగనామం పెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. రైతులు ఏడాది పొడవునా పంటలను సాగు చేస్తూనే ఉంటారని పేర్కొన్న కేసీఆర్‌.. సాగు లెకలు ఇతరత్రా కారణాలు చూపుతూ రైతుబంధును అమలు చేస్తే అవినీతి మొదలవుతుందని హెచ్చరించారు.

మరో రెండేండ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. అప్పుడు మహిళలకు కూడా ఎకువ అవకాశాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని, ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున ఎవరికి బీఫాం దకితే వాళ్లదే విజయమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హష్మీ అనే ప్రొఫెసర్‌ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధానం గురించి , జీరో పొల్యూషన్‌, నగరాల్లో అకడి మేయర్లు ప్రజల్లో మమేకమైన విధానం గురించి కేసీఆర్‌ వారికి వివరించారు.

తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నది. ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున ఎవరికి బీఫాం దకితే వాళ్లదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి.
-కేసీఆర్‌

జడ్పీ చైర్మన్లను సన్మానించిన కేసీఆర్‌
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ జడ్పీ చైర్మన్లను పార్టీ అధినేత కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని తన నివాసంలో శాలువా కప్పి సన్మానించారు. కుటుంబ సభ్యులతో కలిసి సమావేశానికి హాజరైన జడ్పీ చైర్మన్లు కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారిని పేరుపేరునా పలకరించారు. ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిలో భాగం పంచుకున్నందుకు అభినందించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం జడ్పీ చైర్మన్లు అందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను కేటీఆర్‌ అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ కలవడం సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్లు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజాజీవితంలోకి వచ్చాక అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పనిచేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు.
-కేసీఆర్‌
RELATED ARTICLES

తాజా వార్తలు