Sunday, December 29, 2024
HomeTelanganaKCR: భెల్‌కు కేసీఆర్‌ జవసత్వాలు..

KCR: భెల్‌కు కేసీఆర్‌ జవసత్వాలు..

వర్క్‌ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్న కంపెనీకి ఊపిరిలూదిన దార్శనికుడు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్‌. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా సాధ్యమేనని నిరూపించిన కార్యసాధకుడు కేసీఆర్‌.
  • దేశ చరిత్రలోనే తొలిసారిగా సంస్థకు 20,400 కోట్ల ఆర్డర్‌
  • 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు అప్పగింత
  • ప్రైవేట్‌ కంపెనీలను పక్కనబెట్టి ప్రభుత్వ సంస్థ వైపే మొగ్గు
  • వరుసగా పెరిగిన వర్క్‌ ఆర్డర్లు.. తద్వారా పెరిగిన ఆర్డర్‌ బుక్‌వాల్యూ
  • క్రమంగా ఆర్థికంగా బలోపేతమైన విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థ
  • నాడు కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై కార్మికసంఘాల హర్షం

సంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్‌. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా సాధ్యమేనని నిరూపించిన కార్యసాధకుడు కేసీఆర్‌. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యుత్తు రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి, అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పెత్తనానికి చరమగీతం పాడటంతోపాటు సమర్థులైన అధికారులకు జెన్‌కో, ట్రాన్స్‌కో పగ్గాలు అప్పగించారు. యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ప్లాంటు లాంటి భారీ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం పనులను ప్రైవేటు సంస్థలకు కాకుండా ప్రభుత్వరంగంలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు అప్పగించడం ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం. దీంతో పనుల్లో నాణ్యత పెరగడమే కాకుండా బీహెచ్‌ఈఎల్‌ కార్మికులకూ మేలు జరిగింది.

దేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణంలో అగ్రస్థానం బీహెచ్‌ఈఎల్‌ది. జల విద్యుత్తు, థర్మల్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రాల నిర్మాణం పనులు చేపట్టడంలో ఈ సంస్థదే పైచేయి. 16 మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు, రెండు రిపేర్‌ యూనిట్లు కలిగిన ఈ సంస్థ భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విద్యుత్తు కేంద్రాల నిర్మాణం చేపట్టేంది. ఎల్‌ఆండ్‌టీ, సిమెన్స్‌ లాంటి కంపెనీలతో బీహెచ్‌ఈఎల్‌కు పోటీ ఉండేది. 2014 తర్వాతి కాలంలో చైనా సైతం విద్యుత్తు కేంద్రాల నిర్మాణాల పనులు దక్కించుకొని బీహెచ్‌ఈఎల్‌తోపాటు ఇతర విద్యుత్తు సంస్థలకు పోటీదారుగా నిలిచింది. మిగతా హెవీ ఎలక్ట్రికల్‌ సంస్థల కంటే చైనా తక్కువ ఖరీదుకే విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి అవసరమైన టర్బైన్లు, జనరేటర్లు అందించడం ప్రారంభించింది. భారత్‌లోని ప్రైవేటు కంపెనీలు కూడా చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టాయి. దీంతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్డర్‌బుక్‌ వాల్యూ స్థిరంగా బాగున్నప్పటికీ, వర్క్‌ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అప్పట్లో బీహెచ్‌ఈఎల్‌ కంపెనీలో కొంత ఆందోళనకర వాతావరణం ఉండేది.

కేసీఆర్‌ చరిత్రాత్మక నిర్ణయం

దామరచర్లలో 4000 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పనులను కేసీఆర్‌ సర్కార్‌ అప్పగించడంతో బీహెచ్‌ఈఎల్‌ దశ తిరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించడంతో వేలకోట్ల ప్రజాధనం వృథా కాకుండా కాపాడటమే కాకుండా ప్రైవేటు సంస్థలకు లాభాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేసినట్టయ్యింది. దీంతో బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు, కార్మికులకు మేలు జరగడంతోపాటు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం పనులు వేగంగా, నాణ్యంగా జరిగేలా బాటలుపడ్డాయి. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు నిర్వహించకుండానే నామినేషన్‌ పద్ధతిలో దేశ విద్యుత్తు రంగ చర్రితలో ఎన్నడూ లేనివిధంగా బీహెచ్‌ఈఎల్‌కు రూ.20,400 కోట్ల విలువైన వర్క్‌ఆర్డర్‌ను అప్పగించించడం ఈ సంస్థకు వరంగా మారింది.

భారతీయులకు గర్వకారణమైన ఈ ప్రభుత్వరంగ సంస్థ ఇమేజ్‌ మరోసారి సమోన్నతంగా నిలబడింది. టీఎస్‌జెన్‌కో అక్టోబర్‌ 2017లో బీహెచ్‌ఈఎల్‌కు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు సంబంధించిన వర్క్‌ఆర్డర్‌ ఇచ్చింది. ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో పవర్‌ ప్లాంటు నిర్మించేలా ఒప్పందం కుదుర్చుకున్నది. నవంబర్‌ 2017లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌.. బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ అతుల్‌ సోబ్తికి రూ.20,400 కోట్ల పనులకు సంబంధించిన అడ్వాన్స్‌ చెక్‌ను అందజేశారు. యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు ఆర్డర్‌ బీహెచ్‌ఈఎల్‌ ఎగ్జిక్యూటబుల్‌ అవుట్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌బుక్‌లో క్వాంటం జంప్‌కు దారితీస్తుందని, కంపెనీ వృద్ధి వేగాన్ని పెంచడానికి దోహదపడుతుందని అప్పట్లో ఈ సంస్థ పేర్కొంది.

కేసీఆర్‌ సర్కార్‌ ఇచ్చిన వర్క్‌ఆర్డర్‌తో బీహెచ్‌ఈఎల్‌ ఆర్థికంగా బలోపేతం కావటంతోపాటు ఇతర వర్క్‌ ఆర్డర్లు కూడా పెరిగాయి. దీంతో కార్మికులకు ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వం ఇచ్చిన వర్క్‌ఆర్డర్‌ రూ.20,400 కోట్లతో యాదాద్రి పవర్‌ ప్లాంటుకు అవసరమైన 28 పరికరాలను బీహెచ్‌ఈఎల్‌ వేర్వేరు ప్రదేశాల్లో తయారు చేసి యాదాద్రి పవర్‌ ప్లాంటులో అమర్చింది. బీహెచ్‌ఈఎల్‌- హరిద్వార్‌, బీహెచ్‌ఈఎల్‌-తిరుచ్చి, బీహెచ్‌ఈఎల్‌-భోపాల్‌, బీహెచ్‌ఈఎల్‌-ఝాన్సీ, బీహెచ్‌ఈఎల్‌-రుద్రపూర్‌ యూనిట్లలో యాదాద్రి పవర్‌ప్లాంటుకు నిర్మాణానికి సంబంధించిన పరికరాలు తయారయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీహెచ్‌ఈఎల్‌ హైదరాబాద్‌ యూనిట్‌ సైతం యాదాద్రి పవర్‌ప్లాంటుకు సంబంధించి రూ.2వేల కోట్లకుపైగా విలువైన పరికరాలను తయారు చేసి సరఫరా చేసింది.

కేసీఆర్‌ సంకల్ప బలం

2014లో విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు ఉండగా, పదేండ్లలో 20,000 మెగావాట్లకు చేరింది. ఇందుకు కేసీఆర్‌ విద్యుత్తు రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణమే కారణం. నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా కొత్త థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. తొలుత కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్త ప్లాంటు నిర్మాణాన్ని 48 నెలల్లోనే పూర్తి చేయించారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం వద్ద 1080 మెగావాట్ల విద్యుత్తు స్థాపిత సామర్థ్యంతో మరో ప్లాంటును భద్రాద్రి పేరుతో నిర్మించి, విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద 4000 మెగావాట్ల (5×800) సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులకు యాదాద్రి భువనగిరి జిల్లా దామరచర్లలో 2015 జూన్‌ 8న భూమిపూజ చేశారు. 5,558 ఎకరాల్లో దశలవారీగా విద్యుత్తు కేంద్రం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి, ఆ బాధ్యతను టీఎన్‌జెన్‌కోకు అప్పగించారు. 2017 జూన్‌ 29న పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి కూడా పర్యావరణ అనుమతులు లభించాయి. దీంతో జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి. కేసీఆర్‌ సర్కార్‌ యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సింగరేణి బొగ్గు అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు కృష్ణాజలాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైన పక్షంలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టు నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు వీలుగా రైల్వేలైన్‌లు అందుబాటులో ఉంచింది.

బీహెచ్‌ఈఎల్‌కు లాభాలు

బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేసీఆర్‌ అండగా నిలిచారు. 2011-12 తర్వాత వివిధ కారణాల వల్ల బీహెచ్‌ఈఎల్‌కు వర్క్‌ఆర్డర్లు తగ్గాయి. బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాల నిర్మాణాలు తగ్గించాలని ప్రపంచదేశాలు నిర్ణయించడం, అందుకు భారత్‌ కూడా ఒప్పుకోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా నుంచి పోటీ పెరగడంతో 2015-16లో వర్క్‌ఆర్డర్లు మరింత దిగజారాయి. అలాంటి సమయంలో కేసీఆర్‌ బీహెచ్‌ఈఎల్‌కు రూ. 20,400 కోట్ల విలువైన వర్క్‌ఆర్డర్‌ను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడం సాహసోపేతమైన నిర్ణయం.

-ఎల్లయ్య, ఐఎన్‌టీయుసీ నేత

ధైర్యం ఇచ్చిన కేసీఆర్‌

బీహెచ్‌ఈఎల్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌ యాదాద్రి పవర్‌ప్లాంటు నిర్మాణం పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించి కొండత దైర్యం ఇచ్చారు. రూ.20,400 కోట్ల వర్క్‌ఆర్డర్‌ను నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడం బీహెచ్‌ఈఎల్‌కు అన్నిరకాలుగా మేలు చేసింది. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆంక్షలతో ఆర్డర్లు తగ్గుతున్న సమయంలో కేసీఆర్‌ యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం పనులు బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. దీంతో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి వైపు అన్ని రాష్ర్టాలు చూసేలా చేశారు. తద్వారా బీహెచ్‌ఈఎల్‌కు ఆర్డర్లు వరుసగా పెరుగుతూ వచ్చాయి. నాలుగేండ్లుగా మెజార్టీ ఆర్డర్లను బీహెచ్‌ఈఎల్‌ కైసవం చేసుకుంటూ పవర్‌ప్లాంటు నిర్మాణాల రంగంలో నెంబర్‌ వన్‌గా నిలుస్తున్నదంటే కేసీఆర్‌ ఇచ్చిన వర్క్‌ ఆర్డరే కారణం.

– రెహమాన్‌, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీహెచ్‌ఈఎల్‌ హైదరాబాద్‌

బీహెచ్‌ఈఎల్‌ ఇమేజ్‌ పెరిగింది

కేసీఆర్‌ సర్కార్‌ 2017లో బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చిన వర్క్‌ఆర్డర్‌తో సంస్థకు ఎంతో లాభం చేకూరింది. సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు జాతీయంగా, అంతర్జాతీయంగా ఇమేజ్‌ పెరిగింది. బీహెచ్‌ఈఎల్‌కు వర్క్‌ఆర్డర్లు తక్కువగా ఉన్న సమయంలో కేసీఆర్‌.. యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పనులను అప్పగించడం సంస్థ లాభాల బాటలోకి వెళ్లేందుకు బాటలు వేసింది

RELATED ARTICLES

తాజా వార్తలు