Monday, December 30, 2024
HomeTelanganaKCR | మోదీ సృష్టించిన రాజ‌కీయ కుంభ‌కోణం ఢిల్లీ లిక్క‌ర్ స్కాం: కేసీఆర్‌

KCR | మోదీ సృష్టించిన రాజ‌కీయ కుంభ‌కోణం ఢిల్లీ లిక్క‌ర్ స్కాం: కేసీఆర్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం అనేది ప్ర‌ధాని మోదీ సృష్టించిన ఒక రాజ‌కీయ కుంభ‌కోణం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఇది రివ‌ర్స్ పొలిటిక‌ల్ స్కాం అని, అందులో ఏం లేద‌ని, అంత వ‌ట్టిదే గ్యాస్ అని చెప్పారు. ఇప్ప‌టివ‌రకు వ‌ర‌కు ఒక్క‌ రూపాయి కూడా రిక‌వ‌రీ చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎవ‌రి నుంచి ఎవ‌రికి మ‌నీ ల్యాండ‌రింగ్ అయిందో, ఎవ‌రి నుంచి ఎవ‌రు తీసుకున్నారో ఎవ‌రికీ తెలియ‌ద‌ని చెప్పారు. హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీని స్కాం కింద చిత్రీక‌రించార‌న్నారు. తాను, అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాని మోదీకి కంటిలో న‌లుసులాగా ఉన్నామ‌ని, ముక్కులో కొయ్య‌లాగా ఉంటిమ‌ని చెప్పారు.

త‌మ‌కు 104 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా, మ‌జ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న స‌మ‌యంలో మొత్తం 119 ఎమ్మెల్యేల్లో తాము 111 మందిమి ఉన్నామ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డానికి మోదీ త‌న ఏజెంట్ల‌ను రాష్ట్రానికి పంపించార‌ని తెలిపారు. వాళ్ల‌ను ప‌ట్టి నిర్బంధించి జైల్లో వేశామ‌ని పేర్కొన్నారు. ఆ ఏజెంట్ల‌ను పంపించిన మూల‌సూత్ర‌ధారి ప్ర‌ధాని మోదీకి రైట్ హ్యాండ్ అయిన‌ బీఎల్ సంతోశ్ అని చెప్పారు. ఆయ‌న‌ను ప‌ట్టుకుర‌మ్మ‌ని ఢిల్లీలోని బీజేపీ సెంట్ర‌ల్ ఆఫీసుకు మ‌న పోలీసుల‌ను పంపించామ‌ని, అయితే త‌ప్పించుకున్నార‌ని చెప్పారు.

క‌డిగిన ముత్యంలా క‌విత‌..

అదే ప్ర‌ధాని మోదీకి మా మీద కోపం. ఆ క‌క్ష‌ను మ‌న‌సులో పెట్టుకుని అటు అర‌వింద్ కేజ్రీవాల్‌ను, ఇటు త‌న‌ను రాజ‌కీయంగా ఒత్తిడి చేయాల‌ని చెప్పి ఢిల్లీ ముఖ్య‌మంత్రిని, త‌న‌ కూతుర్ని అరెస్టు చేశార‌ని వెల్ల‌డించారు. వాళ్లు క‌డిగిన ముత్యాల్లా బ‌య‌ట‌కు వ‌స్తార స్ప‌ష్టం చేశారు. స్కాం లేదు అది వ‌ట్టి ట్రాష్, అది బూమ‌రాంగ్ అయితున్న‌ద‌ని చెప్పారు. క‌విత‌ బ‌తుక‌మ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్య‌మానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసింద‌ని, అమెరికా నుంచి వ‌చ్చి త‌న జీవితాన్ని వ‌దులుకొని తెలంగాణ కోసం ప‌ని చేసిన బిడ్డ అని పేర్కొన్నారు. ఆమె సామ‌ర్థ్యం ఏంటో అంద‌రికీ తెలుస‌ని, ఆమె మాట్లాడే విధానం, ప్ర‌వ‌ర్త‌న అంద‌రికి తెలుసన్నారు. నిర్దోషిని ప‌ట్టుకుపోయి ఒక మహిళ అని కూడా చూడ‌కుండా.. కేవ‌లం త‌న కూతురు అనే రాజ‌కీయ క‌క్ష‌తో మోదీ అరెస్టు చేసిండ‌ని విమ‌ర్శించారు. ఏం ఫ‌రాక్ ప‌డ‌ద‌ని, త‌మ‌ది రాజ‌కీయ కుటుంబం కాబ‌ట్టి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. తాము అన్ని ఎద‌ర్కొంటామ‌ని, జైళ్లు బెయిళ్లు కొత్త కాద‌ని చెప్పారు. ఆమె క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్త‌దని న‌మ్మ‌కం వ్య‌క్తంచేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు