జగిత్యాల: ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR).. స్థానింకంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు, ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారం, అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కేసీఆర్ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య.. ఎంతగానో సంబురపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కున్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తుచేశారు.
ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వంవహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు రమణయ్య. సాధించిన రాష్ట్రాన్ని అనతికాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు. కష్ణ నష్టాలను, సుఖాలు బాధలను, జయాపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్‌కు చిన్ననాటినుంచి అలవాటేనని, అదే ఆయన విజయాలకు మూలమని, అదే స్థితప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉద్భోదించారు.
తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావుగంట పాటు ఇష్టాగోష్టి కొనసాగించారు. అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం తీసుకుని అక్కడినుంచి బయలుదేరాలు. తన పదమూడో రోజు బస్సు యాత్రను కొనసాగించేందుకు కేసీఆర్ ముందుకు కదిలారు.
జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య గారి ఇంటికి వెళ్ళిన కేసీఆర్.
కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య. pic.twitter.com/kFO8icz2zJ
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024