Sunday, December 29, 2024
HomeNationalLok Sabha Elections | రేపు ఐదో విడుత లోక్‌స‌భ ఎన్నిక‌లు.. బ‌రిలో హేమాహేమీలు

Lok Sabha Elections | రేపు ఐదో విడుత లోక్‌స‌భ ఎన్నిక‌లు.. బ‌రిలో హేమాహేమీలు

హైద‌రాబాద్‌: సార్వ‌త్రిక ఎన్నిక‌ల (Lok Sabha Elections) ఐదో విడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మ‌రికొన్ని గంట‌ల్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్ల‌ను పూర్తిచేసింది. ఈ విడుత‌లో ఉత్తర్​ప్రదేశ్‌లో 14 స్థానాలకు, మహారాష్ట్రలో 13, బంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశా 5, ఝార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌లో ఒక్కొక్క‌టి చొప్పున స్థానాల్లో ఓటింగ్ జరుగనుంది. ఈ నియోజకవర్గాల్లో 695మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. కాగా, ఇదే విడుత‌లో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి హేమాహేమీల భ‌విత‌వ్యం తేల‌నుంది.

కాంగ్రెస్ కంచుకోట‌లో రాహుల్‌

ఉత్త‌రప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తున్నారు. అయితే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న ఆమె ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం రాహుల్ అక్క‌డి నుంచి పోటీకి దిగారు. అయితే ఇప్ప‌టికే కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో పోటీచేసిన ఆయ‌న రాయ్‌బ‌రేలిలో త‌న భ‌విత‌వ్యాన్ని తేల్చుకోనున్నారు. బీజేపీ నుంచి ఇక్క‌డ దినేష్ ప్ర‌తాప్ సింగ్ పోటీచేస్తున్నారు.

అమేథీ మ‌ళ్లీ బీజేపీదేనా..?

కాంగ్రెస్‌ పార్టీ మరో కంచుకోటైన అమేథీని 2019 ఎన్నికల్లో బద్ధలుకొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మ‌రోసారి బ‌రిలో నిలిచారు. గాంధీ కుటుంబానికి అత్యంత‌ సన్నిహితుడైన కిషోరీలాల్‌ శర్మ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 55 వేల పైచిలుకు ఓట్ల‌తో రాహుల్‌పై స్మృతి విజ‌యం సాధించారు.

ల‌క్నోలో రాజ్‌నాథ్..

దేశంలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన రాజ్‌నాథ్ సింగ్‌.. ల‌క్నో నుంచి మూడోసారి పోటీచేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. అంత‌కుముందు ఆయ‌న ఘ‌జియాబాద్లో విజ‌యం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహ్‌రోత్రా రాజ్‌నాథ్‌తో తలపడుతున్నారు.

కైస‌ర్‌గంజ్‌లో బ్రిజ్​భూషన్​ కుమారుడు

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న డ‌బ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూష‌ణ్ సింగ్ కుమారుడు క‌ర‌ణ్ సింగ్ ఈసారి త‌న తండ్రి స్థానమైన కైస‌ర్‌గంజ్ నుంచి బ‌రిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం వల్ల బీజేపీ ఆయన్ను పక్కనపెట్టింది. స‌మాజ్‌వాదీ పార్టీ తరఫున రామ్‌భగత్, బీఎస్‌పీ నుంచి నరేంద్రపాండే బరిలో ఉన్నారు.

స‌ర‌న్‌లో లాలూ వార‌సురాలు..

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తొలిసారిగా ఎన్నికల బ‌రిలో నిల‌బ‌డ్డారు. ఆమె సరన్ లోక్‌సభ స్థానం నుంచి ప్ర‌స్తుత ఎంపీ, బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీతో పోటీప‌డుతున్నారు. ఆయ‌న 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. గ‌తంలో స‌ర‌న్ నుంచి లాలు యాద‌వ్ ప‌లుమార్లు గెలుపొందారు.

నార్త్​ ముంబైలో పియూష్ గోయ‌ల్‌

ఐదో విడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్‌ ముంబై. బీజేపీ కంచుకోట అయిన ఈ స్థానంలో కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ పోటీచేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి గోపాల్ శెట్టి గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున భూషణ్‌ పాటిల్‌ పోటీ చేస్తున్నారు.

  • నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ అహ్మద్ మీర్ ఆయ‌న‌పై బరిలో నిలిచారు.
  • లోక్ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ హాజిపుర్ నుంచి బరిలోకి దిగారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇండియా కూట‌మి నుంచి ఆర్జేడీ అభ్య‌ర్థి చంద్రరామ్ పోటీపడుతున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు