KKR vs MI| ఐపీఎల్ 2024 సీజన్‍లో అద్భుత ప్రదర్శనను కోల్‍కతా నైట్‍రైడర్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఎంత పెద్ద టీమ్‌పైన అయిన కూడా సునాయాసంగా విజయం సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. షారూఖ్ ఖాన్ ఇచ్చిన ధైర్యంతో ఆటగాళ్లు చాలా కసిగా ఆడుతూ కేకేఆర్‌కి మంచి విజయాలు అందిస్తున్నారు. ఈ సీజన్‌లో తొమ్మిదో విజయాన్ని సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కోల్‌కతా .17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై కేకేఆర్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్టటికే తొలగిపోయిన ముంబై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6)ను ముంబై పేసర్ నువాన్ తుషారా తొలి ఓవర్లోనే పెవీలియన్ కి పంపగా, నరైన్ (0)ను గోల్డెన్ డక్ చేశాడు బుమ్రా. అయితే, ఆ తర్వాత కోల్‍కతా బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్) అద్భుతంగా రాణించారు. ఇక చివర్లో ఆండ్రీ రసెల్ (14 బంతుల్లో 24 రన్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 20 పరుగులు) , రమణ్‍దీప్ సింగ్ (8 బంతుల్లో 17 పరుగులు నాటౌట్; ఓ ఫోర్, ఓ సిక్స్) జట్టుకి విలువైన పరుగులు అందించారు. దీంతో భారీ స్కోరే చేసింది కేకేఆర్. అయితే ముంబై బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకోగా.. నువాన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కి మంచి ఆరంభమే లభించింది. పవర్ ప్లేలో ఒక్క వికెట్ పడకుండా ఆడారు. ఎప్పుడైతే స్పిన్నర్స్ రంగప్రవేశం చేశారో మ్యాచ్ కేకేఆర్ చేతిలోకి వచ్చేసింది.16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ సునీల్ నరైన బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడిన రోహిత్ శర్మ (24 బంతుల్లో 19 పరుగులు) ఆ తర్వాతి ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‍లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 11 రన్స్) , కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) , టిమ్ డేవిడ్ (0) , యంగ్ స్టార్ తిలక్ వర్మ (17 బంతుల్లో 32 పరుగులు) , నమన్ ధీర్ (6 బంతుల్లో 17 పరుగులు) ఇలా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు తీసుకోగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ విజయంతో కేకేఆర్ టాప్‌లో కొనసాగుతుంది.