KKR| ఎట్టకేలకి ధనాధన్ టోర్నీ ముగిసింది. అందరు అనుకున్నట్టే ఐపీఎల్ 2024 ముగిసింది. ముచ్చటగా మూడోసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీని ఎగరేసుకుపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందడంతో షారూఖ్ ఖాన్, ఆయన అభిమానులు, కేకేఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హోరాహోరీగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ చప్పగా సాగింది. కేకేఆర్ బౌలర్స్ ధాటికి ఆరెంజ్ ఆర్మీ కుప్పకూలింది. ఎవరు కూడా ధాటిగా పరుగులు చేయలేకపోయారు. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డగా, అదే పిచ్‌పై ఆడిన కేకేఆర్ మాత్రం సునాయాసంగా పరుగులు చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్‌కి 114 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. దాంతో 57 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది.ఈ క్రమంలో నాకౌట్స్‌లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. బంతుల పరంగా కేకేఆర్‌కి ఇది రెండో అతి పెద్ద విజయంగా చెప్పాలి. ఇక ఈ సీజన్‌లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చెందగా, ఇప్పుడు దానిని కేకేఆర్ సమం చేసింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది.
ఇక మ్యాచ్‌లో గెలిచిన కేకేఆర్‌కి రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. మొత్తం రూ.46.5 కోట్లను బీసీసీఐ ప్రైజ్‌మనీ అందించింది. విజేత జట్టుకు రూ. 20 కోట్ల క్యాష్ ప్రైజ్ మనీ.. రన్నరప్ టీమ్ రూ. 13 కోట్ల క్యాష్ రివార్డ్ లభించింది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్లు,.. నాలుగో స్థానం కైవసం చేసుకున్న ఆర్‌సీబీకి రూ. 6.5 కోట్ల ప్రైజ్‌మనీ అందించారు .ఇక వీటితో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ టోర్నీ అవార్డు అందుకున్న ఆటగాడికి రూ. 20 లక్షలు, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాడికి, పవర్ ప్లే ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్న ఆటగాళ్లకు రూ. 15 లక్షల చొప్పున క్యాష్ రివార్డ్ అందించారు. ఇక మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ ఛేంజర్ ఆఫ్ సీజన్ ప్లేయర్లకు రూ. 12 లక్షల అవార్డు ఇచ్చారు.