హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మా పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు వస్తారంటే, మా పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఇరు పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 5వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. అవసరమనుకుంటే ఆ 25 మంది పేర్లు చెప్పేందుకు తాను రెడీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను ఎంపీ ఎన్నికల్లో రెండు సీట్లలో డిపాజిట్ తెచ్చుకోమను. చచ్చిన పామును మళ్లీ ఎందుకు చంపడం అని కేసీఆర్‌ను ఉద్దేశించి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 8 మందిని డమ్మీలను పెట్టి.. బీజేపీని గెలిపిస్తా.. నా బిడ్డ బెయిల్ కు అడ్డం రావొద్దని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ , మోదీ ఇద్దరు ఒక్కటేనని ఆయన అన్నారు.
బీఆర్ఎస్‌లో చేరేందుకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా జూన్ 5న పార్టీ మారబోతున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లే 25 మంది పేర్లు కేసీఆర్‌ను చెప్పమనండి. ఇప్పుడే నేను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే 25 మంది పేర్లు చెబుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
పదేండ్ల రాక్షస పాలనతో కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ. లక్ష కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే కాదు, కార్యకర్త కూడా బీఆర్ఎస్‌లోకి వెళ్లడు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయింది. 75 శాతం మంది కార్యకర్తలు మా పార్టీలోకి వచ్చారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి స్వచ్ఛదంగా కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆరేడుగురు ఎంపీలు నన్ను సంప్రదించారు. నామినేషన్లు ఉపసంహరణ చేసుకుంటామన్నారు. డిపాజిట్లు కూడా మాకు రావు.. కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తామన్నారు. కానీ మేం ఆపాం. ఆ ఆరేడుగురు ఎంపీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉంది. 64 మంది ఎమ్మెల్యేలు చెక్కు చెదరరు. డీలిమిటేషన్‌లో భాగంగా వచ్చే సంవత్సరం 154 అసెంబ్లీ సీట్లు అవుతాయి. హైదరాబాద్‌లో 12 సీట్లు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 125 సీట్లు గెలవబోతున్నాం. తనకు పదవులపై ఆశ లేదు.. వచ్చే పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.