హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 2,32,308 పోస్టులకు అనుతి ఇచ్చారు. 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీ 2014 నుంచి డిసెంబర్ 2023 దాకా జరిగాయని తెలిపారు. కేసీఆర్ హయాంలోనే నోటిఫికేషన్లు జారీ అయి, కోర్టు కేసులు, ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 32,517 ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు ఇచ్చి తానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు సీఎం చెప్పుకుంటున్నారు. అది అవాస్తవం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 1.60 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయగా, 32,517 వేల ఉద్యోగాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. ఇవి అవి మొత్తం కలుపుకుంటే కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక లక్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ హయాంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాకు వెల్లడించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా తొమ్మిదిన్నరేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా కంటే ముందు పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో మొత్తం కలిపి ఏపీపీఎస్సీ ద్వారా, ఇతర సంస్థల ద్వారా 24,086 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. అందులో తెలంగాణలో వాటా 42 శాతం అనుకుంటే.. తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది 10,080 ఉద్యోగాలు మాత్రమే అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ హయాంలో 2 లక్షల 32 వేల 308 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. అందులో 2 లక్షల 2 వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. టీఎస్‌పీఎస్సీ ద్వారా 60,918 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 54,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 35,250 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మరో 18,765 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది.
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 48,247 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 47,068 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. 1179 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల రిక్రూట్‌మెంట్ ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతిస్తే, 12,904 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాగా, 3,694 ఉద్యోగాలను భర్తీ చేశాం. 9,210 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. డీఎస్సీ ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 28,534 ఉద్యోగాలకు నోటిఫికేసన్లు ఇచ్చాం. 22,892 భర్తీ చేశాం. మరో 5,642 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్దు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 9684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. భర్తీ చేసింది 2047 ఉద్యోగాలు. మిగతా 7637 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీల కామన్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన 105 ఉద్యోగాలకు నాటి గవర్నర్ మోకాలడ్డారు. ఇక ఇతర సంస్థలు అన్ని కలుపుకుంటే 54,846 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 49,351 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. 49,132 ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన 219 భర్తీ దశలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
32,517 ఉద్యోగాల భర్తీ వివరాలు..
గురుకులాల్లో 9,210 టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 2023లో రాతపరీక్షలు నిర్వహించారు. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయి. ఈ పోస్టుల భర్తీని కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనం అని చెప్పొచ్చు.
పోలీసు శాఖలో 17,516 ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చాం. జూన్ 2023లో రాతపరీక్షలు నిర్వహించాం. అక్టోబర్ 4, 2023లో ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. పోలీసు ఉద్యోగాల భర్తీ కేసీఆర్ హయాంలోనే జరిగింది. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
5,204 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 2, 2023న రాతపరీక్ష నిర్వహించాం. డిసెంబర్ 23, 2023న ఫలితాలు ప్రకటించాం. ఇవి కూడా తానే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు.
587 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 2023లో రాతపరీక్ష నిర్వహించి, ఆగస్టు 7 2023లో ఫలితాలు ప్రకటించాం. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. పైన పేర్కొన్న ఉద్యోగాలకు రేవంత్ కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది మాత్రం కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 1.60 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయగా, 32 వేల ఉద్యోగాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. ఇవి అవి మొత్తం కలుపుకుంటే కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక లక్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కేటీఆర్ తెలిపారు.