Wednesday, January 1, 2025
HomeTelanganaKTR: కౌశిక్ పై కేసు నమోదు... కేటీఆర్ ఆగ్రహం

KTR: కౌశిక్ పై కేసు నమోదు… కేటీఆర్ ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయటం పై కేటీఆర్ ఆగ్రహం
ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసు
ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్
జనపదం, హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పన పైన మండల విద్యాధికారి తో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా అని ప్రశ్నించారు. ఈ సమావేేశాని ఎందుకు హాజరయ్యారు అంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేమిటన్నారు. ప్రభుత్వాధికారి అయిన డీఈఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగ వ్యవహారిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో లేవనెత్తినట్లు కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా కౌశిక్ రెడ్డి కి హక్కు లేదా అని ప్రశ్నించారు.దళిత బంధు చెక్కుల పంపిణీ తో పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవ్వడంతోపాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ను పోస్టింగ్ ఇవ్వాలని మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ అడిగారని ఇది కూడా నేరమేనా అని కేటీఆర్ అన్నారు.

జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవటంతో నిరసన తెలిపే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గ పూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం కచేశారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం, అక్రమాలను బయటికి తెస్తున్నారు. అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రశ్నించే మీడియా, ప్రజాప్రతినిధులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడిన సరే బీఆర్ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పటికైనా ప్రతీకార చర్యలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు