Kumari Aunty | ‘నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది’ అంటూ తన ఫుడ్‌తో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆమె ఆకర్షించారు. మొత్తానికి తనకు వచ్చిన పాపులారిటీతో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. సెలబ్రిటీ అంటే.. అదేదో యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదు.. అంతకు మించి. యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయిని దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ.. వరుసగా టీవీ షోలు చేస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతోంది. ఏపీ ఫైర్ బ్రాండ్‌కు వ్యతిరేకంగా ఆమె ప్రచారంలో దూసుకెళ్తోంది.
గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలిగండ్ల రాము తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరపున కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కుమారీ ఆంటీ ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గుడివాడలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న కుమారీ అంటీ టీడీపీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. రామును గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు ఆమె వివరిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆమె ఏం మాట్లాడారంటే..
గుడివాడ నియోజకవర్గంలోని నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాను. గుడివాడలో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుంది. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదు. చక్కటి విజన్ ఉన్న రాము కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రాము లాంటి నాయకులు అధికారంలో ఉంటేనే మాలాంటివారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మహర్షీ సినిమాలో మహేష్ బాబు లాంటి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. రాము రియల్ లైఫ్‌లో సేవ చేస్తారు. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో… అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను అని కుమారి ఆంటీ పేర్కొన్నారు.