Uday Nagaraju | ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా ఉద్యోగాలతోపాటు రాజకీయాల్లోనూ భారతీయ మూలాలున్నవారు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తమ పనితీరు, సామర్థ్యంతో రాణిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అధ్యక్ష బరిలో నిలిచిన నిక్కీ హేలీ, యూకే ప్రధాని రిషి సునాక్ ఆయా దేశాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ఇదే యూకే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) యూకే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ స్థానం నుంచి ఆయనను తమ అభ్యర్థిగా ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ ప్రకటించింది. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడైన నాగరాజు.. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పరిపాలనా శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా ఫేమస్ అయ్యారు. ఆయన పోటీ చేయనున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావుకు సమీప బంధువు.
దేశంలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్‌పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఇందులో భాగంగా యూకేలో ప్రధాన ఓటు బ్యాంకుగా మారిన బ్రిటిష్ ఇండియన్ల మద్దతు పొందడానికి కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇండియన్ కమ్యూనిటీకే చెందిన నాగరాజును బరిలో దింపింది. దేశానికి వలస వచ్చిన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. వీరంగా లేబర్ పార్టీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ కూడా భారత మూలాలున్నవారు కావడంతో ఓటు బ్యాంకు చెదిరిపోకుండా జాగ్రత్త పడుతున్నది.